డాక్టర్ అయిన తర్వాత యాక్టర్ అయిన రాజశేఖర్‌లోని అసలు వైద్యుడు అప్పుడప్పుడు బయటకు వస్తూంటారు. అయితే.. వైద్యం మానేసి చాలా కాలం అయింది కాబట్టి… చికిత్స చేసే వైద్యుడ్ని కాకుండా… ఆ వైద్యానికి ఏదైనా సుస్తీ చేస్తే మాత్రం తన ఆగ్రహాన్ని బయటకు తీస్తున్నారు. ఇప్పుడు కేంద్రప్రభుత్వం మీద… డాక్టర్ రాజశేఖర్ ఓ రేంజ్‌లో ఫైరవుతున్నారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్లును… డాక్టర్ హోదాలో రాజశేఖర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రెండు, మూడు రోజుల నుంచి ఆయన ఈ వ్యతిరేకతను ఏ మాత్రం దాచుకోవడం లేదు. సోషల్ మీడియాలో వీడియో పెట్టారు. ఆ తర్వాత నేరుగా.. ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా.. ఆందోళనలు చేస్తున్న డాక్టర్లు, జూనియర్ డాక్టర్లకు మద్దతుగా రంగంలోకి దిగారు. ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో తెలంగాణ వైద్య మహాగర్జన పేరుతో.. వైద్యులు ఆందోళన చేపట్టారు. వీరికి.. ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి ప్రముఖులు సంఘిభావం తెలిపారు.
వీరితో పాటు… డాక్టర్ రాజశేఖర్ కూడా వెళ్లారు. కొత్త జాతీయ మెడికల్ కౌన్సిల్ చట్టంపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎన్ఎంసీ బిల్లుపై నిపుణుల సూచనలు తీసుకోవాలని రాజశేఖర్ కేంద్ర ప్రభుత్వానికి సలహాలిచ్చారు. ఇప్పటికే ఆస్పత్రుల్లో ఎవరైనా చనిపోతే డాక్టర్లను కొడుతున్నారని మండిపడ్డారు. ఆరు నెలల శిక్షణతో ఎవరైనా వైద్యం చేయవచ్చనే వెసులుబాటు కొత్త చట్టం ఇచ్చిందని… ఈ బ్రిడ్జి కోర్స్ వచ్చాక ఏమైనా జరిగితే అందరం తన్నులు తింటామని.. రాజశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చట్టాలు చేస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవలేదని తేల్చేశారు.
రాజశేఖర్ సినిమాల పరంగా హీరోనే కానీ.. బయటకు వస్తే మాత్రం.. భార్య జీవితకు.. సహాయపాత్రకే పరిమితమవుతూంటారు. ఏదైనా ఆమె మాట్లాడతారు. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన జీవితారాజశేఖర్… వైసీపీ కోసం ప్రచారం చేశారు. వారికి జగన్ ఏదో పదవి ఇస్తారన్న ప్రచారం అయితే జరుగుతోంది కానీ… వైసీపీ నేతలు మాత్రం.. లైట్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే.. రాజశేఖర్ మాత్రం.. మెడికల్ బిల్లుపై మాత్రం. జీవిత లేకుండానే.. పోరాటం చేస్తున్నారు. బహుశా.. తనలో ఉన్న డాక్టర్ క్యారెక్టర్‌కి రాజశేఖర్ న్యాయం చేస్తున్నారు కావొచ్చు..!