సత్తెనపల్లిలో మాజీ స్పీకర్ కోడెలకు చెక్ పెట్టే ప్రయత్నాలు టీడీపీలో జోరుగా సాగుతున్నాయి. సత్తెనపల్లి టీడీపీ విషయంపై తెరపైకి కొత్తగా రాయపాటి సాంబశివరావు కుమారుడు… రంగారావు తెరపైకి వచ్చారు. కోడెలకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న సత్తెనపల్లి టీడీపీ నేతలతో చర్చలు ప్రారంభించారు. కోడెల వ్యతిరేకులను ఏకతాటి మీదకు తెచ్చి.. పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు రాయపాటి రంగారావు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తన అనుచరులతో కోడెల శివప్రసాదరావు అత్యవసరంగా భేటీ అయ్యారు. పార్టీకి చెందిన రెండు కార్యాలయాల్లో వీరి సమావేశాలు జరిగాయి. సత్తెనపల్లిలో టీడీపీకి రెండు కార్యాలయాలు ఉన్నాయి. ఒకటి కోడెల పెట్టుకోగా.. మరొకటి ఎప్పటి నుంచో ఉంది. కోడెల ఆఫీసు..కోడెల కార్యక్షేత్రం కాగా.. అసమ్మతి వాదులకు టీడీపీ కార్యాలయం వేదికగా మారింది.
రాయపాటి రంగారావు..సొంతంగా..సత్తెనపల్లి అసమ్మతి నేతలతో.. చర్చలకు కోసం వెళ్లరని… హైకమాండ్ సూచన మేరకే… సత్తెనపల్లి వెళ్లి ఉంటారన్న చర్చ టీడీపీలో జరుగుతోంది. నిజానికి రాయపాటి సాంబశివరావు.. టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరాలనే ఆలోచనలో ఉన్నారు. రామ్ మాధవ్ ఇంటికి వచ్చి ఆహ్వానించడంతో… ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఆర్థికపరమైన వెసులుబాట్లు కలుగుతాయన్న ఉద్దేశంతో ఓకే చెప్పారంటున్నారు. అయితే.. ఆయన కుమారుడు మాత్రం.. పార్టీ మారబోనని.. చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అలా ప్రకటించడమే కాదు… పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు కూడా. రాయపాటి సాంబశివరావు ఇప్పుడు ఏ పార్టీలో చేరినప్పటికీ.. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం వయోభారం కారణంగా సాధ్యం కాదు. అందుకే.. ఆయన వారసుడు టీడీపీలోనే ఉండి రాజకీయ భవిష్యత్ ను నిర్మించుకోవాలనుకుంటున్నారు.
నిజానికి గత ఎన్నికల సమయంలో… టిక్కెట్ల సర్దుబాటులో ..రాయపాటి రంగారావు పేరు.. సత్తెనపల్లి, నర్సరావుపేటలకు ప్రచారంలోకి వచ్చింది. అయితే.. తాను పోటీ చేసి తీరుతానని రాయపాటి సాంబశివరావు పట్టుబట్టడంతో.. ఆయనకు సర్దుబాటు చేయలేకపోయారు. అప్పట్నుంచి నియోజకవర్గం కోసం.. ఎదురు చూస్తున్న రంగారావుకు.. సత్తెనపల్లి వివాదం కలసి వచ్చినట్లుగా కనిపిస్తోంది. టీడీపీ హైకమాండ్ కూడా.. సత్తెనపల్లి నుంచి కోడెలను తప్పించాలనే అనుకుంటోందని.. అందుకే రాయపాటి రంగారావును ప్రొత్సహిస్తోందని అంటున్నారు. ముందు ముందు సత్తెనపల్లి రాజకీయం మరింత జోరందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.