పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన సీఎం కేసీఆర్ కుమార్తె ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, అప్పట్నుంచీ ఆమె పార్టీ కార్యక్రమాల్లో ఏమంత దూకుడుగా లేరు. పార్టీలో కీలకమైన పదవులపైగానీ, బాధ్యతల స్వీకరణకుగానీ సుముఖంగా ఉన్నట్టూ కనిపించడం లేదు! సరే, ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు కీలకం కావడానికి ఉండాల్సిన వెలుసుబాటు ముఖ్యమంత్రి కుమార్తెగా ఉంటుందనుకోండి. అయితే, కవిత రాజకీయ భవిష్యత్తు ఏదో తేలే వరకూ ఆ ఇద్దరికీ తెరాస నుంచి ఎలాంటి పదవులూ దక్కే పరిస్థితి లేదని సమాచారం.
ఆ ఇద్దరూ ఎవరంటే… కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు! ఎన్నికలకు కొన్నాళ్లు ముందుగానే సురేష్ రెడ్డి తెరాసలో చేరారు. అప్పట్లో వినిపించింది ఏంటంటే.. ఆయన్ని రాజ్యసభకు పంపిస్తారనీ, లేదంటే శాసన మండలిలో స్థానం కల్పిస్తారని! ఎన్నికలు అయిపోయిన తరువాత సురేష్ రెడ్డికి పదవులు అనే ప్రస్థావనే తెరాసలో చర్చకు రాలేదు. పిలిచి పదవి ఇస్తారేమో అని ఎదురుచూస్తే తెరాస అధినాయకత్వం నుంచి సురేష్ రెడ్డికి ఎలాంటి వర్తమానాలూ రావడం లేదు! దీంతో ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసినట్టు సమాచారం. తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనే అంశంపై పరిశీలించాలంటూ ఆయన ఇటీవలే కోరారట! ఇక, మరో సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మండవ ఇంటికి వెళ్లి మరీ తెరాసలోకి ఆహ్వానించారు. లోక్ సభ ఎన్నికల సమయంలో, నిజామాబాద్ లో కవితకు వ్యతిరేకంగా దాదాపు 185 మంది పసుపు రైతులు నామినేషన్లు వేస్తే… వారిని బుజ్జగించేందుకు మండవను రంగంలోకి దింపే ప్రయత్నం కేసీఆర్ చేశారు. అదే సమయంలో, మండవకీ మంచి పదవి గ్యారంటీ అనుకున్నారు. అయితే, ఆయనకీ ఇప్పట్లో ఏ పదవీ ఉండదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
సురేష్ రెడ్డి, మండవలకు పదవులు రావాలంటే… వారికంటే ముందుగా కవిత క్రియాశీలం కావాలి, పార్టీలో ఏదో ఒక బాధ్యతను తీసుకోవాలి. కవిత ఇంకా ఓటమి భారంలోనే ఉన్నారనీ, ఇలాంటప్పుడు ఆమెకి కాకుండా ముందుగా ఈ ఇద్దరికీ పదవులు ఇస్తే బాగోదనే అభిప్రాయం తెరాస వర్గాల్లో ఉంది. పార్టీ మారితే భవిష్యత్తు మారిపోతుందని అనుకున్నారు. కానీ, తమ పదవులకు ఇలాంటి అడ్డంకి ఒకటొస్తుందని ఊహించి ఉండరు కదా!