కేంద్ర ప్రభుత్వం గత పార్లమెంట్ ఎన్నికల్లో సంచలనాత్మక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఆర్టీఐ చట్ట సవరణ నుంచి కశ్మీర్ విభజన వరకు.. అన్నింటిపైనా ప్రజల్లో కూడా చర్చ జరిగింది. కానీ..ఓ బిల్లు మాత్రం.. సైలెంట్‌గా చట్టం అయిపోయింది. ఇది సెలబ్రిటీలకు సంబంధించినది. అదనపు ఆదాయం కోసం.. సెలబ్రిటీలు ఇతర బ్రాండ్లకు ప్రచారం చేస్తే.. చివరికి వారిని అది జైలుకు పంపే ప్రమాదం కూడా ఆ బిల్లులో ఉంది.
దొంగ కంపెనీలకు ప్రచారం చేస్తే జైలు శిక్ష.. జరిమానా..!
1986లో ప్రవేశపెట్టిన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ చట్టంలో కొన్ని మార్పులు చేసి…బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం పొందింది కేంద్రం. కంపెనీ గురించి తెలుసుకోకుండా సెలబ్రెటీలు ఎవరు బ్రాండ్లకు అంబాసిడర్‌కు పని చేసినా…పెనాల్టీ చెల్లించేలా నిబంధనలు రూపొందించారు. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా యాడ్స్ ఉన్నా…ఫేక్ కంపెనీల తరపున ప్రచారం చేసినా…సెలబ్రెటీలతో పాటు కంపెనీలు లక్షల్లో పెనాల్టీ చెల్లించేలా కేంద్రం ప్రతిపాదనలు చేసింది. పెనాల్టీతో సరిపెట్టకుండా….ఫేక్ యాడ్స్ చేస్తే రెండు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. ఏదైనా కంపెనీ లేదా సెలబ్రెటీ పదే పదే…వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఎండార్స్మెంట్లలో చేస్తే…50లక్షలు జరిమానా విధించాలని నిర్ణయించింది.
ఇక సెలబ్రిటీలు ముందూ వెనుకా చూసుకోవాల్సిందే..!
కంపెనీలు తమ ఉత్పత్తులు జనాల్లోకి త్వరగా వేళ్లేందుకు….సెలబ్రెటీలను ఉపయోగించుకుంటున్నాయి. షాంపూలు, సబ్బులు, సౌందర్య ఉత్పత్తులు, ఫేమస్ కంపెనీలు…సినీ తారలను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటుంటారు. పేస్ట్ నుంచి పర్ఫ్యూమ్ వరకు…తలకు వేసుకునే షాంపూ నుంచి కాళ్లకు వేసుకునే షూస్ వరకు..ఇలా ఎన్నో ప్రకటనలకు బ్రాండ్ అంబాసిండర్లు బాలీవుడ్, టాలీవుడ్ తారలే ఉంటారు. సినీతారలు, క్రికెటర్లు, సీరియల్ నటులు అందరూ…తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించుకునేందుకు… యాడ్స్ చేసేందుకు మొగ్గు చూపుతుంటారు. సినిమాల్లో కంటే కూడా కంపెనీల ఉత్పత్తులను ప్రమోషన్ చేసి సెలబ్రిటీలు కోట్లు సంపాదించుకుంటున్నారు. తాము ఏ కంపెనీకి ప్రచారం చేస్తున్నామో.. చూసుకోకపోతే.. కొత్తగా వచ్చిన బిల్లుతో వారు జైలు శిక్షను కూడా బహుమతిగా పొందినట్లే..!
తారలను చూసి ప్రజలు మోసపోకుండా చేసే ప్రయత్నం..!
సెలబ్రెటీలు సంస్థలకు ప్రచారం చేస్తుండటంతో జనం కూడా గుడ్డిగా నమ్మి మోసం పోతున్నారని కేంద్రం ఈ చట్టం తీసుకు వచ్చింది. చిట్‌ఫండ్ సంస్థలు, విల్లాల కొనుగోళ్లు, రియల్ ఎస్టేట్ సంస్థల విషయంలో లక్షలాది మంది మోసం పోతున్నారు. తారలను చూసి జనం బోల్తా పడుతున్నారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో కేంద్రం వినియోగదారుల హక్కుల కోసం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంతో ఫేక్ ప్రచారానికి తెరపడితే.. వినియోగదారులకు మేలే జరుగుతుంది.