దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పేందుకు… తాను కూడా ఓ ఉదాహరణగా నిలవాలని.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుంతరావు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన ఆయన ఇప్పుడు.. తాను ఆ పార్టీలో ఉండాలో… వద్దో .. ఈ నెల ఇరవయ్యో తేదీ తర్వాత క్లారిటీ ఇస్తానని.. నేరుగా ఢిల్లీలో.. తెలుగు మీడియా సమావేశం పెట్టి ప్రకటించారు. ఆ ప్రకటన ఏదో హైదరాబాద్‌లో చేయవచ్చు కదా అనే అనుమానం చాలా మందికి రావొచ్చు కానీ… అక్కడికి వెళ్లిన తర్వాత వీహెచ్ ఆవేశాన్ని అణుచుకోలేకపోయారు. అందుకే ప్రెస్ మీట్ పాత సంగతులన్నీ చెప్పి.. తాను పార్టీని వీడిపోతానని బెదిరించారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో రాహుల్‌కు చెబుతానంటూ… వీహెచ్ ఢిల్లీకి వెళ్లారు. అక్కడకు వెళ్లిన తర్వాత ఆయన ఏ కాంగ్రెస్ అగ్రనేతనూ కలవలేకపోయారు. రాహుల్ గాంధీ ఇప్పుడు… కాంగ్రెస్ నేతలకు అపాయింట్‌మెంట్లు ఇవ్వడం లేదు. తన లాంటి రాజీవ్ గాంధీ వీర విధేయుడు వచ్చినప్పటికీ.. రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం.. ఆయనను నిరాశకు గురి చేసింది. ఇప్పుడే కాదు.. రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయిన తర్వాత.. ఆయనను కలవాలని.. నెలకోసారి వీహెచ్ అపాయింట్ మెంట్ అడుగుతూనే ఉన్నారు. కాంగ్రెస్ వ్యవహారాలఫై నివేదికలు పంపుతూనే ఉన్నారు. కానీ గతంలో అలాంటివి పంపినప్పుడు.. వచ్చే రియాక్షన్.. ఈ మధ్య కాలంలో లేదు. అసలు వాటిని పట్టించుకునే వారు లేరని తెలియడంతో.. వీహెచ్ ఇబ్బంది పడుతున్నారు. అందుకే.. ఖమ్మం కాంగ్రెస్ టిక్కెట్ తనకు ఇవ్వకపోవడం దగ్గర్నుంచి.. రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి బహిష్కరించకపోవడం వరకు చాలా అంశాలు మీడియా ముందు మాట్లాడేశారు.
ఇప్పుడు వీహెచ్ మాటల్ని పట్టించుకునేంత తీరిక.. ఆసక్తి.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కూడా లేవు. ఆయన పార్టీ వదిలి వెళ్లిపోతానన్నా… పట్టించుకునేవారు లేరు. వీహెచ్ ఉన్నా .. లేకపోయినా.. ఒకటే అని పీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా.. అందరూ అనుకుంటున్నారన్న ప్రచారం.. గాంధీభవన్‌లో సాగుతోంది. అయితే.. హైకమాండ్ వద్ద తనకు ఉన్న పలుకుబడి.. సీనియర్ అనే పేరుతో.. తనకు గౌరవం దక్కుతుందని భావిస్తూ వస్తున్న వీహెచ్‌కు అలాంటి పరిస్థితులేమీ కనిపించడం లేదు. అందుకే.. పార్టీ వదిలి పోతాననే ప్రకటనలు చేస్తున్నారు. అలా ప్రకటన చేయగానే.. బీజేపీ నుంచో.. ఇతర పార్టీల నుంచో ఆఫర్లు వస్తాయేమోనని ఆయన అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కానీ.. బీజేపీ తెలంగాణలో మరీ అంత రిస్క్ తీసుకునే పరిస్థితిలో లేదని… కాంగ్రెస్ నేతలే సెటైర్లు వేస్తున్నారు.