ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన వెంటనే.. ఎట్టి పరిస్థితుల్లోనూ.. కొన్ని కాంట్రాక్టులను.. పనులను నిలిపివేయాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అలాంటి వాటిలో రాష్ట్రానికి జీవనాడి లాంటి.. పోలవరం ప్రాజెక్ట్ కూడా ఉంది. ఆ ప్రాజెక్టు స్పిల్ వే ప్రధాన డ్యాం పనులు చేపడుతున్న నవయుగ కంపెనీకి టెర్మినేషన్ నోటీసులు కూడా ఇచ్చేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే… మచిలీపట్నం పోర్టు అభివృద్ధి ఒప్పందాన్ని రద్దు చేశారు. ఇది కూడా నవయుగ కంపెనీదే. దీంతో.. అసలు నవయుగ కంపెనీనే జగన్ ఎందుకు టార్గెట్ చేశారన్న అంశం హాట్ టాపిక్ అవుతోంది. పాత విషయాలన్నీ మెల్లగా బయటకు వస్తున్నాయి.
అసలు కథ వాన్ పిక్ ప్రాజెక్ట్ దగ్గరే ప్రారంభం..!
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు.. వాన్ పిక్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం… నిమ్మగడ్డ ప్రసాద్‌తో పాటు.. రస్ అల్ ఖైమా అనే.. అరబ్ దేశానికి చెందినదని అందరూ అనుకుంటారు. కానీ.. మొదటగా.. ఈ వాన్ పిక్ ప్రాజెక్టును ప్రారంభించింది.. నవయుగ ఇంజినీరింగ్ కంపెనీనే. ఈ కంపెనీలో..నవయుగకు 65 శాతం ఉంది. అయితే.. వైఎస్ఆర్ మరణం తర్వాత.. జగన్మోహన్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి.. సొంత పార్టీ పెట్టుకోవాలనుకున్నప్పుడు.. నవయుగ కంపెనీ.. ఆ ప్రాజెక్ట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. 65 శాతం వాటాలను.. నిమ్మగడ్డ ప్రసాద్ తో పాటు రస్ అల్ ఖైమాకు అమ్మేసింది. అలా అమ్మకం ప్రక్రియ పూర్తయిన తర్వాత… ఇలా ఆ ప్రాజెక్టు చుట్టూ సీబీఐ కేసులు ముసురుకున్నాయి. దాంతో.. ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. నవయుగ బయటపడింది.
క్లిష్ట పరిస్థితుల్లో వదిలేశారనే నవయుగపై జగన్‌కి కోపమా..?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు.. నవయుగ కంపెనీకి.. చాలా కాంట్రాక్టులు దక్కాయి. జలయజ్ఞంలో భాగంగా.. చాలా పనులు నవయుగ కంపెనీ చేపట్టింది. అయితే.. అంతగా ప్రొత్సహించినప్పటికీ.. తన తండ్రి దూరమైన తర్వాత కాంగ్రెస్‌ను వదిలేటప్పుడు… తనకు నవయుగ యాజమాన్యం అండగా నిలవలేదని.. జగన్ భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వాన్ పిక్ ప్రాజెక్ట్ విషయంలో సీబీఐ పలుమార్లు.. నవయుగ ప్రతినిధుల్ని కూడా ప్రశ్నించారు. వారు గుట్టుముట్లన్నీ చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. అందుకే.. అధికారం చేపట్టిన వెంటనే… నవయుగ చేపడుతున్న కాంట్రాక్టులనే టార్గెట్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఆ కంపెనీ ఇప్పటి వరకూ చేసిన పనులు ఎన్ని ఉన్నప్పటికీ… ఉన్న పళంగా.. ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే.. జగన్.. ఈ కాంట్రాక్టుల రద్దుకు ఉపక్రమిస్తున్నట్లుగా చెబుతున్నారు.
రామోజీతో బంధుత్వమూ శత్రుత్వం పెంచుకోవడానికి కారణమా..?
ఇటీవల రామోజీరావు మనవరాలికి వివాహం జరిపించారు. చనిపోయిన సుమన్ కుమార్తె సోహనకు… నవయుగ వారసుల్లో ఒకరికి ఇచ్చి పెళ్లి చేశారు. దీంతో.. సహజంగానే.. జగన్మోహన్ రెడ్డికి ఉన్న కోపం… ఇప్పుడు.. ఆ కారణంగా కూడా పెరిగిపోయిందనే అంచనాలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. సాధారణంగా.. జగన్మోహన్ రెడ్డి.. ఎవరినైనా టార్గెట్ చేస్తే.. ముందుగా ఆర్థికంగా దెబ్బకొట్టాలనుకుంటారని.. అదే ప్లాన్‌ను నవయుగ మీద అమలు చేస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి.. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నంత కాలం.. ఇక నవయుగ.. ఎంత తక్కువకు కోట్ చేసినప్పటికీ.. కాంట్రాక్టులు దక్కే అవకాశాలు మాత్రం లేవు. ఉన్న వాటికి.. నిధులు కూడా మంజూరు కావని.. తాజా పరిణామాలతో స్పష్టమవుతోందని.. పారిశ్రామికవర్గాల్లో చర్చ జరుగుతోంది.