తెలుగు360 రేటింగ్ – 2.5/5
బలం లేని పాత్రలు, సింక్ లేని సీన్లు, పాత చింతకాయపచ్చడి కథ, పరిపక్వత లేని స్క్రిప్ట్, గ్రాంథికం-పోర్చుగీస్ కలగలిపిన డైలాగులు, వీటికి బూతు సీన్ల తాళింపు, ఇదీ మన్మధుడు 2 సినిమా.
ఎంత దానికీ దీనికీ సంబంధం లేదని మేకర్లు చెప్పినా, జనం మాత్రం మన్మధుడు సినిమాను గుర్తు పెట్టుకునే మన్మధుడు 2 సినిమాకు వెళ్తారు. అలా వెళ్లిన వాళ్లకు మరీ బాధేస్తుంది. కుటుంబ సమేతంగా, హాయిగా నవ్వుకుంటూ చూడగలిగే ఆ సినిమా ఎక్కడ,?
ఫ్యామిలీలను కిలోమీటర్ దూరంలో వుంచే ఈ సినిమా ఎక్కడ?
అందమైన స్టిల్స్, చిట్టిపొట్టి దుస్తుల్లో రకుల్ అందాలు, బోలెడు మంది నటులు, మాంచి లోకేషన్లు వీటికి తోడు మన్మధుడు 2 అన్న టైటిల్. ఇవన్నీ కలిసి ఈ సినిమాను చూడాలనే ఆసక్తిని కలిగించన మాట వాస్తవం. కానీ ఆ ఆసక్తికి తగినట్లు సినిమా వుందా? మన్మధుడు 2 చెప్పిన చేదు వాస్తవం ఏమిటి? చూద్దాం.
పోర్చగీస్ లో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన సాంబశివరావు అలియాస్ సామ్(నాగార్జున) ప్రేమించిన అమ్మాయిని తల్లి (లక్ష్మి) ఇతర కుటుంబ సభ్యులు ఓకె చేయరు. దానికి కారణం ఆ అమ్మాయి (కీర్తి సురేష్)కు ఇంటి పనులు రాకపోవడమే. దాంతో అలిగి ఇంట్లోంచి వెళ్లిపోయిన సామ్ పక్కా వుమనైజర్ గా మారిపోతాడు. అమ్మాయి కనిపిస్తే చాలు ఏదో విధంగా పక్కలోకి లాగడగమే కార్యక్రమం.
ఈ సంగతి తెలియక, ఎలాగైనా పెళ్లి చేసుకోమని తల్లి, ఇతర కుటుంబ సభ్యులు పోరుతుంటే, ఆఖరికి అవంతిక (రకుల్ ప్రీత్ సింగ్) అనే అమ్మయిని కిరాయి ప్రేమికురాలిగా ఇంటికి తీసుకువస్తాడు. అప్పుడు ఏం జరిగింది అన్నది మిగిలిన సినిమా.
ఎవరో కొత్త వాళ్లు ఇలాంటి సినిమా తీసారు అంటే సరిపెట్టుకోవచ్చు, అనుభవరాహిత్యం అనుకోవచ్చు లేదా ఆలోచనా రాహిత్యం అని కూడా అనుకోవచ్చు. కానీ నాగార్జున లాంటి అనుభవం పండించుకున్న నిర్మాత, నటుడు ఇలాంటి సినిమా తన బ్యానర్ మీద అందించాడు అంటే ఆ అనుభవాన్ని కాస్త అనుమానించాల్సిందే. చిలసౌ వంటి సున్నితమైన భావోద్వేగాల సినిమా అందించిన దర్శకుడు రాహుల్ రవీంధ్రన్ నుంచి ఇలాంటి సినిమా వచ్చింది అంటే అతని స్టామినా మీద అనుమానం కలగాల్సిందే.
మన్మధుడు 2 సినిమాకు తొలి సమస్య కథలోని పాయింట్. ఇలాంటి పాయింట్ తో తెలుగులో సవాలక్ష సినిమాలు వచ్చాయి. ఈ పాయింట్ కోసం విదేశీ కథను డబ్బులు పెట్టి కొనుక్కురావడం అంటేనే తొలి తప్పిదం జరిగిపోయినట్లు. ఆ తరువాత ఆ పాయింట్ ను ఈ తరం కుర్రకారును ఇలా అయితేనే ఆకట్టుకుంటాం, ఇలా అయితేనే జనం సినిమాకు వస్తారు అనే ఆలోచనతో, ఓ బూతు సినిమా మాదిరిగా మార్చాలన్న ప్రయత్నంతో మలి తప్పిదం కాదు, ఘోర తప్పిదం జరిగిపోయింది. ఇక ముచ్చటగా మూడో తప్పిదం, అవసరం లేదా అర్థం లేని సన్నివేశాలు, వాటి మధ్య కుదరని పొంతన. ఇంతటితో అయిపోలేదు ఆఖరి తప్పిదం కూడా వుంది. శ్లిష్ట వ్యావహారిక పదాలకు విదేశీ భాషా పదాలు జోడించిన సంభాషణలు. కాస్త బాగున్న కామెడీ కూడా దీనివల్ల జనాలకు బుర్రలకు రిజిస్టర్ కాకుండా పోయింది.
మన్మధుడు సినిమా చాలా సిల్లీగా టేకాఫ్ తీసుకుంటుంది. చాలా ఫోర్స్ డ్ గా అనిపించే కామెడీ సీన్ తో స్టార్ట్ అయినపుడే, సినిమా ఎలా వుండబోతోందో అన్న హింట్ ఇచ్చినట్లు అవుతుంది. ఆ తరువాత హీరో ఇంటి సన్నివేశాల్లో అవసరానికి మించి డ్రామా చోటు చేసుకోవడం, డైలాగ్ డెలవరీలో కూడా ఆ డ్రామా పాళ్లు కనిపించడం వంటివి చూస్తే, ఇవి కామెడీ కోసం క్రియేట్ చేసినట్లుగా అనిపించకపోగా, ఎప్పటికాలం సినిమా చూస్తున్నాము అనిపిస్తుంది.
ఇక నాగార్జున శృంగార సన్నివేశాలు పరాకాష్ఠ. శృంగార సన్నివేశాల్లో దబ దబ శబ్దాలు, సామగ్రి ఊగిపోవడాలు ఇవన్నీ ఏనాటి కాలానివి? ఎవరు చూసి ఆనందించడానికి? ‘ఇక ఫ్లోర్ ప్లే చాలు..మ్యాచ్ మొదలు పెట్టు’ లాంటి డైలాగులు, ఝాన్సీకి రకుల్ లిప్ టు లిప్ కిస్ పెడితే, ఆమె కాస్తా రెచ్చిపోయి, మగడిని పడకగదికి లాగేయడం, ఇలా ఒకటి కాదు, అనేకానేక సీన్లు.
సినిమాలో వచ్చే బ్రహ్మీ కొద్ది సెకండ్ల సీన్ చూస్తే మేకర్లకు సినిమా మీద సీరియస్ నెస్ వుందా అన్న అనుమానం కలుగుతుంది. అలాగే సినిమాలో గంజాయి సీన్ అయితే ఇక చెప్పక్కరలేదు. ఇక్కడ ఇంకో గమ్మత్తు ఏమిటంటే, ఏ సీన్లు ఎందుకు వస్తుంటాయో? ఎందుకు పోతుంటాయో? అన్నట్లు వుంటాయి. ఓ అద్దె ప్రియురాలిని ఇంట్లోకి తేవాలి అన్న అయిడియా హీరోకు రావడం కోసం ఓ సీన్. దాని కోసం సమంత. అలాగే హీరోయిన్ కు హీరో మీద అభిమానం కలిగించడం కోసం ఓ సీన్. అక్కడో ఫైట్.
సినిమాలో శృంగార సన్నివేశాల విషయంలో మొహమాట పడని నాగార్జున, డ్యూయట్ పెట్టడంలో మాత్రం మొహమాట పడినట్లు కనిపిస్తుంది. ఆఖరికి ఓ పాట అయినా వుండకపోతే బాగుండదని, మాంటేజ్ కమ్ డ్యూయట్ టైపులో ఓ పాట పెట్టారు. పాటల సమస్య వల్ల సినిమాలో రిలీఫ్ లేకుండా పోయింది.
సినిమాలో డైలాగు కామెడీ వుంది. కానీ శ్లిష్ట వ్యావహారికం, విదేశీ భాష కలిపి వాడడం వల్ల ఆ కామెడీని ఎంజాయ్ చేయకుండా అయింది. అప్పటికీ వెన్నెల కిషోర్ తొలిసగంలో కొన్ని, మలి సగంలో మరి కొన్ని నవ్వులు పూయించాడు. కానీ అవి సినిమాకు ఏ మాత్రం సరిపోవు. సినిమాలో బలమైన కథ లేకపోవడం వల్ల ద్వితీయార్థాన్ని ఏదో విధంగా నెట్టుకురావాల్సి వచ్చింది. దానివల్ల అక్కరలేని సీన్లు కొన్ని జోడించాల్సి వచ్చింది. చివరకు ఏదో విధంగా ఎమోషనల్ క్లయిమాక్స్ కు దారితీయించి, సినిమా అయిపోయింది అనిపించారు.
సినిమాలో మార్కులు నాగార్జున కన్నా రకుల్ ప్రీత్ సింగ్ కే ఎక్కువ పడతాయి. తొలిసగంలో అందాలు ఆరబోసినా, టీనేజ్ అమ్మాయిగా కవ్వించే చూపులు విసిరినా, క్లయిమాక్స్ లో ఎమోషన్ బాగా పండించింది. నాగార్జున తను థర్టీస్ లో వున్నట్లు వున్నాను, తన అందగాడిని, తను మన్మధుడిని అనే భ్రమ నుంచి బయటకు రావాలి. ఆ భ్రమలు వుండడం వల్ల, అందుకు అనుగుణంగా డైలాగులు రాయించడం, సీన్లు తయారుచేసుకోవడం మీద దృష్టి పెట్టారు కానీ కథ మీద, సీన్లను కలిపే థ్రెడ్ మీద దృష్టి పెట్టలేదు. దీనివల్ల సినిమా ఎక్కడిక్కడ ముక్కలు ముక్కలుగా వుండి, ఆ ముక్కలు కూడా కొన్ని రంజింపచేసి, కొన్ని చేయక సినిమాకు నెగిటివ్ చేసాయి.
ఝాన్సీ, లక్ష్మీ, రావురమేష్ ఇలా మిగిలిన వారంతా కూడా కాస్త ఓవర్ యాక్షన్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది.
సినిమాకు సాంకేతిక సహకారం మరీ అద్భుతంగా ఏమీ అందలేదు. పోర్చుగల్ విజువల్స్ మాత్రమే బాగున్నాయి. రీరికార్డింగ్ ఊసు ఆడియన్స్ కు పట్టదు. పాటలు అంతంత మాత్రం.
మొత్తం మీద మన్మధుడు 2 అనే సినిమా ప్రేక్షకుల ప్రశంసలు పొందడానికి ఆమడ దూరంలో ఆగిపోయింది.
ఫినిషింగ్ టచ్…మన్మధుడు -టూ…మచ్