గత కొన్ని నెలలుగా మాజీ ఎంపీ వివేక్ భాజపాలో చేరతారూ అంటూ వార్తలొచ్చాయి. అబ్బేం అదేం లేదు… సమయం వచ్చినప్పుడు చెబుతా అంటూ వచ్చారాయన! గత నెలలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కలిసినప్పుడే కాషాయ కండువా కప్పేసుకుంటారని అనుకున్నారు. కానీ, ఆషాఢం అడ్డొచ్చిందనీ ముహూర్తాలు కుదర్లేదనే కారణాలతో ఆగారని కథనాలొచ్చాయి. ఎట్టకేలకు వరలక్ష్మీ వ్రతం రోజు మంచిదని అనుకున్నారో ఏమో… మొత్తానికి ఇవాళ్ల భాజపాలో చేరిపోయారు. భాజపా వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో మాజీ ఎంపీ వివేక్ పార్టీలో చేరారు. అంతకుముందు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాని కలుసుకున్నారు.
అనంతరం మీడియాతో వివేక్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి పోరాటం చేస్తున్నానీ, భాజపాతో కలియడంతో ఆ పోరాటం ఇప్పుడు మరింత తీవ్రతరం అవుతుందన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలనను దెబ్బకొట్టాలని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారన్నారు. గతంలో తెరాసలో, తిరిగి కాంగ్రెస్ లోకి, ఆ తరువాత తెరాసలోకి, ఇప్పుడు భాజపాలోకి… ఇలా పదేపదే పార్టీలు మారడంపై తనకు ఎలాంటి ఇబ్బందిగా అనిపించడం లేదన్నారు! కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాను తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించడం కోసం తెరాసకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. కేవలం ఉద్యమం కోసమే తెరాసకు వెళ్తున్నాననీ, రాష్ట్రం రాగానే తిరిగి వచ్చేస్తాననీ, కాంగ్రెస్ కి వ్యతిరేకం కాదని నాడు సోనియాకు చెప్పానన్నారు. తెలంగాణ వచ్చాక తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కేసీఆర్ అన్నారనీ, కానీ మాట తప్పారన్నారు. ఆ తరువాత తాను కాంగ్రెస్ లోకి వచ్చినా తగిన గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తానెప్పుడూ స్వార్థం కోసం పార్టీలు మారలేదనీ, ప్రజలకు అనుగుణంగా మారాల్సి వచ్చిందన్నారు!
తెలంగాణ భాజపాలో తాను ఎలాంటి పాత్ర పోషిస్తాననేది ఇప్పుడే చెప్పలేనన్నారు! అయితే, కేసీఆర్ ని గద్దె దించడమే తన పోరాట ఉద్దేశం అంటున్నారు. ఇప్పటికే అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణాలను మార్చాలంటే కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై పోరాటం ప్రారంభించారు. సొంతంగా దానిపై కొంత కార్యాచరణ కూడా నడిపించారు. ఇక ఇప్పుడీ పోరాటం భాజపాది అవుతుందా, దాన్ని వివేక్ లీడ్ చేస్తారా… వివేక్ కి ఇప్పుడున్న భాజపా రాష్ట్ర నేతలు ఆ స్థాయి అవకాశం ఇస్తారా అనేది చూడాలి.