జాతీయ అవార్డులతో తెలుగు సినిమా మెరవడం… ఏకంగా ఏడు జాతీయ అవార్డులు రావడం ఒక ఎత్తయితే… ఉత్తమ నటిగా కీర్తి సురేష్ (మహానటి)కి గానూ ఉత్తమ నటిగా అవార్డు పొందడం మరో ఎత్తు. మహానటి చూసినవాళ్లెవరికైనా `ఈసారి అవార్డులన్నీ కీర్తి సురేష్‌కి దక్కడం ఖాయం` అనిపిస్తుంది. కానీ జాతీయ అవార్డు వస్తుందా? అనేది ఎక్కడో చిన్న అనుమానం. దానికి చాలా కారణాలున్నాయి. తెలుగు సినిమాలో కథానాయికని జాతీయ అవార్డుల జ్యూరీ ఎప్పుడూ పట్టించుకోలేదు. 66 ఏళ్ల నుంచి జాతీయ అవార్డులు ఇస్తున్నా…. ఇప్పటి వరకూ కేవలం నాలుగంటే నాలుగు సార్లు తెలుగు సినిమాలో నటించిన ఓ కథానాయిక జాతీయ అవార్డు అందుకుందంటే నమ్మగలరా?? కానీ అది సత్యం.
పైగా తెలుగు సినిమా కథానాయిక పాత్రంటే ఓ మూసలో కొట్టుకుపోతోంది. పాటలు, గ్లామర్‌కే పరిమితమైపోయింది కథానాయిక.కేవలం గ్లామర్ డాల్‌గా, హీరో వెనుక పడి, అతని ప్రేమ కోసం అర్రులు చాచే యువతిగానే కథానాయిక పాత్రని తీర్చిదిద్దుతున్నారు. ఈ వైఖరిలో ఇప్పుడిప్పుడే కాస్త మార్పు వస్తోంది. అయితే.. గతంలో అయితే కథానాయిక పాత్రని మరీ చిన్న చూపు చూసేవారు. అందుకే తెలుగు నాట కథానాయిక పాత్రలెవీ.. నిలబడలేకపోయాయి. అయితే అప్పుడప్పుడూ కొన్ని మెరుపులు కనిపించాయి. శారద, విజయశాంతి లాంటి కథానాయికలు తమలోని నటనా వైవిధ్యం చూపించే ప్రయత్నంలో అవార్డులు గెలుచుకోవడంలో సక్సెస్ అయ్యారు.
1978 సంవత్సరంలో తొలిసారి శారద జాతీయ అవార్డు దక్కించుకుంది. నిమజ్జనం సినిమాతో. పదేళ్లకు అంటే 1988లో దాసి చిత్రానికి గానూ అర్చన జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైంది. 1990లో కర్తవ్యం చిత్రానికి గానూ విజయశాంతికి ఈ అవార్డు వరించింది. అప్పటి నుంచి.. ఇప్పటి వరకూ ఏ ఒక్కరూ ఈ అవార్డు దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు. ఇన్నాళ్లకు.. అంటే 28 ఏళ్ల తరవాత కీర్తి ఆ ఘనత సాధించింది. మహానటితో జాతీయ అవార్డుని సాధించి – ఇన్నేళ్ల కొరత తీర్చింది.
నిజానికి ఈ అవార్డు అంత ఈజీగా దక్కలేదు. మరాఠీ, కన్నడ, హిందీ చిత్రాల నుంచి కీర్తికి గట్టి పోటీ ఎదురైంది. అయితే.. జ్యూరీ మాత్రం కీర్తి సురేష్ వైపు మొగ్గింది. సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి కీర్తి పడిన తాపత్రయం, ఎదుర్కున్న కష్టాలు.. వెండి తెరపై స్పష్టంగా కనిపించాయి. రెండో సినిమాకే.. అంత బరువైన పాత్రని పోషించడం మామూలు విషయం కాదు. తెలుగులో ఓ బయోపిక్ రావడం, ఓ కథానాయిక జీవితాన్ని తెరపై చూపించాలనుకోవడం, అందుకు గానూ… ఏమాత్రం అనుభవం లేని కీర్తిని ఎంచుకోడం, కీర్తి.. తనకిచ్చిన పాత్రకు ప్రాణం పోయడం… మహానటి విజయానికి కేంద్ర బిందువుగా మారడం – ఇవన్నీ జ్యూరీని మెప్పించి ఉంటాయి. ఏదేమైతేనేం.. ఇన్నేళ్ల తరవాత తెలుగు తెర, తెలుగు కథ ఓ జాతీయ ఉత్తమ నటిని చూడగిలిగింది. థ్యాంక్యూ.. సావిత్రి.. థ్యాంక్యూ మహానటి టీమ్.