ఆర్టికల్ 370ని మోడీ సర్కారు రద్దు చేసిన దగ్గర్నుంచీ పాకిస్థాన్ గుడ్లురుమి చూస్తోంది. సంఝోతా ఎక్స్ ప్రెస్ ని ఆపేసింది, వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది, పాక్ లో భారత రాయబార కార్యాలయాన్ని బహిష్కరించింది! అంతేకాదు, పుల్వామా తరహాలో దాడులు జరుగొచ్చేమో అంటూ కవ్వింపు ప్రకటనలు చేస్తోంది. కాశ్మీరుని లాక్కుంటామంటూ అక్కడి హోం మంత్రి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో, మా అభిప్రాయం తెలుసుకోకుండా కాశ్మీరుపై నిర్ణయం తీసుకుంటారా అంటూ ఏకంగా ఐక్యరాజ్య సమితిలో పాక్ ఫిర్యాదు చేసింది. అయితే, అక్కడ పాక్ కి చుక్కెదురైందనే చెప్పాలి. కాశ్మీరు విషయంలో మేం జోక్యం చేసుకోలేం అని ఐరాస చెప్పేసింది. యు.ఎన్. ప్రధాన కార్యదర్శి యాంటోనియో గ్యుటెరస్ ఒక ప్రకటన చేస్తూ… 1972లో భారత్-పాక్ ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఉటంకించారు. జమ్మూ కాశ్మీరుపై రెండు దేశాలూ శాంతియుతంగా చర్చించుకోవాలనీ, సమస్యలుంటే సామరస్యంగా మీరే పరిష్కరించుకోవాలని తేల్చి చెప్పారు.
1972లో అప్పటి పాక్ ప్రధాని జుల్ఫికర్ బుట్టో, భారత ప్రధాని ఇందిరా గాంధీ సిమ్లా ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండు దేశాల మధ్య సమస్యల్ని ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకుందాం అనుకున్నారు. కాశ్మీరు లాంటి సున్నితమైన అంశాల్లో యు.ఎ.ఒ.తో సహా ఇతర ఏ సంస్థల జోక్యాన్ని తాము అంగీకరించేది లేదని అప్పట్లోనే భారత్ చెప్పింది. ప్రస్తుతం పాక్ ఫిర్యాదు నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని ఐరాస ప్రస్థావించడం విశేషం.
నిజానికి, భారత్ అంశమై ఇప్పుడు పాకిస్థాన్ చేస్తున్న హడావుడిని ప్రపంచదేశాలేవీ పెద్దగా పట్టించుకోవడం లేదు. చివరికి అగ్రరాజ్యం అమెరికా కూడా… కాస్త దూకుడు తగ్గించుకోవాలంటూ పాకిస్థాన్ కి హితోపదేశం చేసింది! భారత్ లో పరిణామాలను పాక్ వ్యతిరేకించడంతో… అక్కడ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. బంగారం ధర భారత్ తో పోల్చుకుంటే రెండింతలు పెరిగింది. పాక్ కరెన్సీ విలువ కూడా దారుణంగా పడిపోయింది. పెట్రో ఉత్పత్తుల ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని నియంత్రించలేని పరిస్థితిలో ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు. మొత్తానికి, కాశ్మీరు అంశంలో పాక్ ప్రకటనల్లో ఇంకా దూకుడు తగ్గనట్టుగానే కనిపిస్తోంది. దేశంలో ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయంగా పాక్ అభిప్రాయానికి పెద్దగా మద్దతు లభించని పరిస్థితులున్నాయి. కనీసం వీటిని గుర్తించైనా వెనక్కి తగ్గుతుందో లేదో చూడాలి.