ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టాలీవుడ్ పెద్దలు అంత అర్జంట్‌గా కలవాల్సిన అవసరం ఏమిటని.. నటుడు రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. ఎస్వీబీసీ చైర్మన్, కమెడియన్ ఫృధ్వీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ.. టాలీవుడ్ పెద్దలు ఎవరూ పట్టించుకోవడం లేదని.. కనీసం ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి కూడా వారికి మనసొప్పడం లేదని.. విమర్శలు గుప్పించారు. ఇది టాలీవుడ్లో కలకలం రేపింది. జగన్ సీఎం కావడం.. టాలీవుడ్ పెద్దలకు ఇష్టం లేదని.. ఫృధ్వీ విమర్శలు గుప్పించారు. దీనిపై.. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న రాజేంద్రప్రసాద్… కౌంటర్ ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయిపోగానే… వెళ్లి కలవడానికి సినీనటులేం వ్యాపారవేత్తలు కాదన్నారు. కళాకారులు.. ముఖ్యమంత్రిని వెంటనే కలవాలన్న నిబంధన ఏమీ లేదని గుర్తు చేశారు.
సినీ కళాకారుల్లో వ్యాపారులున్నప్పటికీ… అత్యవసరంగా కవాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ సీఎంగా సెటిల్ అయిన తర్వాత ..తీరిగ్గా ఉన్నప్పుడు కలుస్తామన్నారు. ఫృధ్వీని నేరుగా విమర్శించకపోయినప్పటికీ.. ఆయన వ్యాఖ్యలను మాత్రం రాజేంద్రప్రసాద్ తోసిపుచ్చినట్లయింది. జగన్‌తో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకున్నారు. కొద్ది రోజుల కిందట.. వైసీపీలోనే యాక్టివ్ గా ఉన్న పోసాని కృష్ణమురళి కూడా.. ఫృధ్వీ వ్యాఖ్యలను తప్పు పట్టారు. జగన్ సీఎం కావడం టాలీవుడ్ కు ఇష్టం లేదనడం కరెక్ట్ కాదన్నారు. ఫృధ్వీ తొందరపడి ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని వ్యాఖ్యానించారు.
వైసీపీకి పని చేసిన టాలీవుడ్ ప్రముఖులు కూడా.. ఫృధ్వీకి మద్దతు ఇవ్వలేదు. ఆయన వ్యాఖ్యలను బహిరంగంగా ఖండించకపోయినా.. సినీ పెద్దలు.. జగన్ కు వ్యతిరేకమన్న ప్రకటనను మాత్రం సమర్థించడం లేదు. అయితే.. ఫృధ్వీ సైలెంట్‌గా ఉండే.. రకం కాదు. తన వ్యాఖ్యలను ఖండించిన వారికి ఆయన కచ్చితంగా కౌంటర్ ఇస్తారు. ఏమని ఇస్తారన్నదానిపై.. ఆసక్తి ఏర్పడింది. రాజేంద్రప్రసాద్.. నిర్మోహమాటంగా.. సీఎంను కలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించడంతో ఫృధ్వీ స్పందిస్తారని భావిస్తున్నారు.