ఉండి నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నరసింహ రాజు ఆ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పదలచుకున్న ఉద్దేశం వేరే అయినప్పటికీ ఆయన నోట వచ్చిన వ్యాఖ్యలు పార్టీని ఇరకాటంలో పెట్టే పరిస్థితి ఏర్పడింది. ( ఎన్నికల నియమావళికి విరుద్ధంగా) వైఎస్ఆర్సిపి ప్రతి ఎమ్మెల్యే కి 10 నుండి 18 కోట్ల రూపాయలు ఎన్నికల ముందు పంపింది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
నరసింహ రాజు గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున పని చేశారు. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా టికెట్ దక్కకపోవడంతో ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ విషయాలు చెబుతూ ఆయన, అలా రాజకీయాలకు దూరంగా ఉన్న తనను జగన్ స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారని, అయితే తాను వ్యాపారాలతో బిజీ అయిపోయి రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్నానని ఆయనతో చెబితే జగన్ దానికి స్పందిస్తూ, అన్ని విషయాలు వెరిఫై చేసుకున్నామని, సర్వే ప్రకారం మీరైతే బాగుంటుందని తనను బలవంతం చేస్తే, కేవలం జగన్ కోరిక మేరకు తాను ఎన్నికల్లో పోటీ చేశానని, తన వ్యాపారాలు పక్కనపెట్టి, తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి, ఒక్క రూపాయి కూడా పార్టీ నుండి తీసుకోకుండా తాను ఎన్నికల సంగ్రామం లో నిలబడ్డానని ఆయన అన్నారు. అక్కడితో ఆగకుండా, తనతో పాటు పోటీచేసిన మిగిలిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు పార్టీ నుండి దాదాపు 10 నుండి 18 కోట్ల రూపాయల వరకు ఎన్నికల ముందు, ఎన్నికల ఖర్చుల కోసం అందిందని, తాను మాత్రం పార్టీ నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఇప్పటికీ తాను నియోజకవర్గ ప్రజల తరఫున పని చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు.
ఏది ఏమైనా, వైఎస్ఆర్సిపి పార్టీ తమ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ఎన్నికల ముందు 10 నుండి 18 కోట్ల దాకా పంపింది అన్న విషయం స్వయంగా ఆ పార్టీ నేత నోట రావడం సంచలనం సృష్టిస్తోంది. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో డబ్బు ఏరులై పారింది అన్న విషయాన్ని స్వయంగా అధికార పార్టీ నేత నోట వెంట రావడం ప్రజలలో కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.