లెజిస్లేచర్ పార్టీలను విలీనం చేసేసుకుంటున్న వ్యవహారాలు… చట్ట సభల నుంచి ఇప్పుడు.. రాజకీయాల్లోకి తేవాలని… బీజేపీ నిర్ణయించుకుంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీని.. బీజేపీలో విలీనం చేసుకుంటామని.. ఆ పార్టీ నేతలు హడావుడి ప్రారంభించారు. టీడీపీలో ఇప్పటికే నేతలు లేకుండా పోయారు. ఉన్న అతి కొద్ది మంది నేతలు.. తమకు రాజకీయ భవిష్యత్ ఉన్నా.. లేకపోయినా.. టీడీపీలోనే ఉంటామని చెబుతున్నారు. మొన్నటి పరిషత్, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఎక్కడా సీట్లు రాలేదు. తెలంగాణ మొత్తం మీద.. ఒకే ఒక్క ఎంపీపీ సీటు టీడీపీకి దక్కింది. అయితే.. మిగిలిన కొంత మంది నేతల్ని కూడా.. పార్టీలో చేర్చుకుని.. ఆ పార్టీని విలీనం చేసుకుని.. సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
టీడీపీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు బీజేపీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నిజానికి గత నెలలో సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ తో పాటే.. గరికపాటి కూడా బీజేపీలో చేరాల్సి ఉంది. అయితే తన వర్గంతో కలసి.. బీజేపీలో కండువా కప్పుకుంటానని అప్పట్లో గరికపాటి మోహనరావు అమిత్ షాకు చెప్పినట్లు సమాచారం. దీంతో ఈనెల 18న అమిత్ షా సమక్షమంలో గరికపాటి బీజేపీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తనతో పాటు టీటీడీపీ జిల్లాలకు చెందిన తెలుగుదేశం కార్యవర్గాలను బీజేపీలో విలీనం చేస్తానని ఆయన బీజేపీ అగ్రనేతలకు చెప్పారట. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, మెదక్ , రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైద్రాబాద్ జిల్లాల కార్యవర్గాలు ఇందులో ఉన్నట్లు గరికపాటి వర్గాలు చెబుతున్నాయి.
అయితే జిల్లాల కార్యవర్గాలను ఒక రాజ్యసభ ఎంపీ .. మరో పార్టీలో ఏ విధంగా విలీనం చెస్తారో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే.. ఈ వ్యవహారంపై టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కనీసం స్పందించటం లేదు. ఇతర నేతలూ లైట్ తీసుకుంటున్నారు. పొలిట్ బ్యూరో మీటింగ్లో మాత్రం… సభ్యత్వ నమోదును ప్రారంభిస్తాం. పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటిస్తూ ఉంటారు. వీరి తీరును అలుసుగా తీసుకుని బీజేపీ… తెలంగాణలో టీడీపీని విలీనం చేసుకుంటామని చెబుతున్నారు. అయితే.. జిల్లాల కార్యవర్గాలు చేరిపోయినంత మాత్రాన.. టీడీపీ విలీనం జరిగిపోతుందా… అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా ప్రచారం చేసుకుని బీజేపీ తన పరువు తానే తీసుకుంటోందని.. వ్యాఖ్యానిస్తున్నారు.