తెలంగాణలో మందస్తు ఎన్నికలకు వెళ్లాలని.. టీఆర్ఎస్ అనుకున్నప్పటి నుంచి.. పాలన ముందుకు సాగడం లేదు. ఫైళ్లన్ని గుట్టలు, గుట్టలుగా పేరుకుపోయాయి. గత ఏడాది ఆగస్టు నుంచి ఎన్నికల హడావుడి ప్రారంభమయింది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ, పరిషత్ ఎన్నికలు వచ్చాయి. ఆ హడావుడి అంతా పూర్తయ్యేలోపు మున్సిపల్ ఎన్నికలు ప్లాన్ చేస్తున్నారు. అవి ఆలస్యం అవుతున్న సమయంలో.. వెంటనే.. సెక్రటేరియట్ తరలింపు ప్రక్రియ చేపట్టారు. అన్నింటికన్నా.. ఉన్నతాధికారులకు సెక్రటేరియట్ తరలింపు పెద్ద తలనొప్పిగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. శాఖల తరలింపు పూర్తి అయినా పాలన గాడిలోపడేందుకు చాల సమయం పడుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాలు తాత్కాలిక సెక్రటెరియట్ బిఆర్కే భవన్ లోనే జరుపుకోవాలని సీఎం అదేశించారు. దాందో… ప్రధాన శాఖల్ని ఇప్పటికే అక్కడకు తరలించారు. ప్రస్తుతం కార్యాలయాల ఆధునీకరణ, వసతుల కల్పన పనులు కొనసాగుతున్నాయి. 9 అంతస్తులున్న బీఆర్కే భవన్లో మంత్రులందరి కార్యాలయాలతో పాటు కీలక శాఖలకు కేటాయించారు. పార్కింగ్ సౌకర్యం కోసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వరకు రహదారిని మూసేస్తున్నారు. ఎంత వేగంగా తరలింపు చేపట్టినా పాలన మాత్రం ఇప్పట్లో గాడిలో పడే అవకాశం లేదని సెక్రటెరియట్ ఉద్యోగులు అంటున్నారు.
న్నో ఏళ్లనుండి ఉన్న కీలకమైన ఫైల్స్ ను తరలింపు చేసినా బిఆర్కే భవన్ లో సరిపడ స్థలం లేకపోవడంతో ఆయా శాఖల అధికారులు,సిబ్బంది అందోళన పడుతున్నారు. ఎవరి శాఖ ఫైల్స్ వారే భద్రపరుచుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో అధికారులు టెన్షన్ పడుతున్నారు. పాత ఫైల్స్ ను భద్రపరచడం రోజువారీ పనులు చేసే విధానం గాడిలోపడాలంటే ఇప్పట్లో సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. కొత్తగా బిఆర్కే భవన్ కు తరలింపు చేసినా రోజు వారి కార్యక్రమాలను మొదలు కావంటే కత్తిమీదా సాముగా తయారైయిందని సెక్రటెరియట్ ఉద్యోగులు వాపోతున్నారు. ఐటీ సేవలు అందుబాటులోకి రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది.