ఈ నెల 18న టీడీపీ నేత గరికపారి మోహన్ రావుతోపాటు కొంతమంది నేతలు భాజపాలో చేరబోతున్న సంగతి తెలిసిందే. అయితే, వీరంతా కేంద్ర హోం మంత్రి, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాని నిన్ననే కలుసుకున్నారు. తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం కాబోతున్నామనీ, చాలా ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు భాజపావైపు చూస్తున్నాయంటూ వారితో అమిత్ షా వ్యాఖ్యానించినట్టు సమాచారం..! నిజానికి, చాలా ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు భాజపావైపు చూస్తున్న పరిస్థితి ఉందన్నది వాస్తవం. కోరినా కోరకపోయినా భాజపాకి మద్దతు ఇవ్వడానికి చాలా పార్టీలు రెడీగా ఉన్నాయి. అమిత్ షా ఫోన్ చేస్తే చాలు, జీ హుజూర్ అంటూ వాలిపోయే పరిస్థితిలో ఉన్నాయి.
అమిత్ షా వ్యూహాన్ని జాగ్రత్తగా గమనిస్తే… ప్రాంతీయ పార్టీలతో దాదాపు ఒకేరకమైన ధోరణి అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎవ్వరినీ అక్కున చేర్చుకోకుండా, అలాగని దూరం పెడుతున్నామనీ వ్యవహరించకుండా, తమపై ఆధారపడే ఒకరకమైన పరిస్థితిని అలానే కొనసాగిస్తూ వస్తున్నారు. రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఏ ఒక్కరికో తాము దగ్గర అనే అభిప్రాయాన్ని కలిగించకుండా చాలా జాగ్రత్త వహిస్తున్నారు. భాజపాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా… అంశాలవారీ మద్దతు అనే మాట చెప్తూ ఎక్కడో ఒక చోట భాజపాతో ఒక లింక్ ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల పార్టీల విషయమే తీసుకుంటే… తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నామంటూ తెల్లారి లేచించి మొదలు భాజపా నేతలు చెబుతుంటారు. కేసీఆర్ సర్కారుపై తీవ్రమైన విమర్శలు చేస్తుంటారు. తెరాస నేతలు కూడా అందుకు ధీటుగానే స్పందిస్తుంటారు. కానీ, ఢిల్లీకి వచ్చేసరికి… సమాచర హక్కు బిల్లుపై భాజపాకి అనుకూలంగా పార్లమెంటులో తెరాస ఓటేసింది. ట్రిపుల్ తలాక్, కాశ్మీరు అంశం వంటివాటిపై తెరాస వైఖరి భాజపాకి సానుకూలంగానే ఉంది!
ఆంధ్రాలో చూసుకుంటే… భాజపాకి దగ్గరయ్యే ప్రయత్నం వైకాపా చేస్తోందిగానీ, వైకాపాతోనే మా నయా దోస్తీ అనే అభిప్రాయాన్ని కలిగించే అవకాశం భాజపా ఇవ్వడం లేదు. గతంలో తమిళనాడులో వ్యవహరించిన వ్యూహాన్నే ఏపీలో అనుసరిస్తోంది. అన్నాడీఎంకేతో దోస్తీ అని చెప్పుకుంటూ వచ్చి, కరుణానిధిని పరామర్శించి వచ్చారు ప్రధాని మోడీ. ఎందుకంటే, మర్యాదపూర్వక కలయిక అన్నారు! ఆ తరువాత, దేశవ్యాప్త సంచలమైన టూజీ స్పెక్ట్రమ్ కేసు ఏమైందో చూశాం. ఏపీలో కూడా ఇప్పుడు వైకాపా మీదగానీ, టీడీపీ మీద అమితమైన రాగద్వేషాలు ప్రదర్శించే పనిని అమిత్ షా చేయడం లేదు. ప్రాంతీయ పార్టీలకు దగ్గరగానూ కాదు, దూరంగానూ కాదు అన్నట్టుగా వ్యవహరిస్తూ… ఓపక్క భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుంటూ, ప్రస్తుతానికి తమ మీద ఆధారపడే పరిస్థితి కల్పించి ఉంచుతున్నారని చెప్పొచ్చు.