జొమాటో సంస్థ మరొక వివాదంలో చిక్కుకుంది. కోల్ కతా లోని జొమాటో డెలివరీ బాయ్స్ తాము బీఫ్, పోర్క్ లాంటి ఆహారాన్ని డెలివరీ చేయలేమని అది తమ మత విశ్వాసాలకి వ్యతిరేకమని నినదిస్తూ రేపటినుండి సమ్మె చేయనున్నారు. వెస్ట్ బెంగాల్ మంత్రి రజిబ్ బెనర్జీ కూడా వర్కర్ల పక్షాన నిలబడుతూ సంస్థ యాజమాన్యానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం అక్కడి సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. వివరాల్లోకి వెళితే..
జొమాటో యాప్, ఇటీవలి కాలంలో అతి వేగంగా అభివృద్ధి చెందిన ఫుడ్ డెలివరీ యాప్. అయితే వ్యాపార విస్తరణలో భాగంగా, రేపటి బక్రీద్ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని, బీఫ్ వండే కొన్ని హోటళ్లను కొత్తగా జొమాటో కి అనుసంధానం చేశారు. అయితే, తాము బీఫ్ సరఫరా చేయలేమని ఇందు లో పనిచేసే కొంతమంది హిందూ డెలివరీ బాయ్స్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఇటీవలి కాలంలో పోర్క్ చేసే హోటల్స్ ని కూడా జొమాటో కి అనుసంధానం చేశారు. పోర్క్ డెలివరీ చేయడానికి ముస్లిం డెలివరీ బాయ్స్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అటు హిందూ యువకులు ఇటు ముస్లిం యువకులు, ఇద్దరూ కూడా తాము బతుకు తెరువు కోసం ఈ సంస్థలో పని చేసే మాట వాస్తవమే అయినప్పటికీ అందుకోసం తమ మత విశ్వాసాలని పణం గా పెట్టలేమంటూ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారడంతో వెస్ట్ బెంగాల్ లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం లోని మంత్రి కూడా స్పందించాల్సి వచ్చింది. అయితే ఆయన కూడా వర్కర్ల పక్షానే నిలబడడంతో వివాదం పెద్దగా అయ్యింది.
అయితే ఇటీవలి కాలంలో జోమాటో తరచుగా వివాదాల్లో చిక్కుకుంటోంది. ఈ సంస్థ డెలివరీ బాయ్ తాను డెలివరీ చేయాల్సిన ఆహారాన్ని దారి మధ్యలో ఎంగిలి చేసిన వీడియో ఆ మధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇక గత వారం సంస్థ ట్యాగ్ లైన్ ” ఆహారమే మా మతం” కూడా సోషల్ మీడియాలో వివాదాలకు దారి తీసింది. అయితే వాటితో పోలిస్తే ఇప్పుడు ఏర్పడిన వివాదం మరింత పెద్దదిగా కనిపిస్తోంది. మరి ఈ సమస్యను జోమాటో ఏ విధంగా పరిష్కరించుకుంటుందో, రేపటి సమ్మె ఎంత తీవ్రంగా ఉంటుందో అనేది వేచి చూడాలి.