తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ లు ఇద్దరూ ఇప్పుడు ఒకేమాట అన్నట్టుగా ఉన్నారు. రెండు ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళితే రెండు రాష్ట్రాలకూ మంచిదే. ఇదే క్రమంలో తెరాస, వైకాపా ప్రభుత్వాలు కలిసి కొన్ని ప్రాజెక్టులు కూడా నిర్మించాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల నుంచి రెండు రాష్ట్రాల మంత్రులు జగదీష్ రెడ్డి, అనిల్ కుమార్ కలిసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ… తెలంగాణ సీఎం కేసీఆర్ ని ఆకాశానికి ఎత్తేశారు..!!
తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ కి కూడా మేలు జరిగేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ మెచ్చుకున్నారు ఏపీ మంత్రి. కేసీఆర్ ని పెద్దన్నగా జగన్మోహన్ రెడ్డి భావిస్తారన్నారు! ఇరు రాష్ట్రాలకు మేలు చేసే విధంగా జగన్ నిర్ణయాలు ఉంటున్నాయన్నారు. రైతులను ఆదుకోవడం కోసం రెండు రాష్ట్రాలూ ఒకరికొకరు సాయం చేసుకునే విధంగా ముందుకు సాగుతామన్నారు. ఆ తరువాత, తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నీళ్ల విషయంలో తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకెళ్తాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో 35 లక్షల హెక్టార్లకు నీరు అందిస్తున్నామని చెప్పారు.
ఇంతకీ… మంత్రి అనిల్ కుమార్ చెబుతున్నట్టుగా కేసీఆర్ సర్కారు ఆంధ్రాకి జరిగే మేలుని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాలు ఏవైనా ఉన్నాయా..? ఉమ్మడి రాజధానిలో భవనాలను ఆంధ్రా సర్కారు తెలంగాణకు అప్పగించింది. మరో ఐదేళ్లపాటు ఉండాల్సిన హక్కుల్ని ఏపీ సర్కారు వదులుకుంది. ఇందులో ఏపీ వదులుకున్నదే కనిపిస్తోంది! ఇక, విద్యుత్ బకాయిల విషయానికొస్తే… రూ. 5 వేల కోట్లు ఇవ్వాలంటే, అబ్బే రూ. 2 వేల కోట్లే కదా అంతెందుకూ అని తెలంగాణ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఢిల్లీలో ఏపీ భవన్ విషయమే తీసుకుంటే… అది నిజాం వారసత్వ సంపద భవనం, కాబట్టి మాదే, మీకు హక్కు లేదని ఆంధ్రాతో వాదిస్తోంది. ఇంకా, విభజన చట్టం ప్రకారం పంచుకోవాల్సిన ఆస్తులు చాలానే ఉన్నాయి. వీటిల్లో చాలా అంశాలపై తెలంగాణ పట్టుబడుతున్నవే ఎక్కువ! మరి, ఆంధ్రా ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఏ నిర్ణయాలను కేసీఆర్ తీసుకున్నారో, తద్వారా ఏపీకి జరిగిన ప్రయోజనం ఏంటో ఏపీ మంత్రికే తెలియాలి. గోదావరి జలాలను సాగర్ కి తరలించాలన్న ప్రతిపాదనలో తప్ప… మంత్రి అనిల్ కుమార్ చెబుతున్నట్టు ఆంధ్రాకి మేలు చేసిన కేసీఆర్ నిర్ణయాలు ఎక్కడున్నాయో మరి..? అయితే, రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్యా ఒక సామరస్యపూర్వక వాతావరణం మాత్రం ఇప్పుడు ఉంది. ఈ విషయంలో ఇద్దరు సీఎంల చొరవ ఉంది.