కన్నడ స్టార్, ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు అయిన ఉపేంద్ర … ఏపీలో జగన్మోహన్ రెడ్డి చేసిన.. స్థానికులకే 75 శాతం ఉద్యోగాలనే చట్టానికి బాగా ప్రభావితం అయ్యారు. ఆయన కర్ణాటకలో.. ఉద్యోగాలన్నీ.. కన్నడిగులకే ఇవ్వాలంటూ.. ఉద్యమం ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. అభిమానులతో ఆప్యాయంగా.. ఉప్పీ అని పిలిపించుకునే ఉపేంద్రకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ పెట్టి.. ఖాకీ చొక్కాతో హడావుడి చేసినప్పటికీ.. ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. కానీ.. తను రాజకీయ బాట వీడలేదని చెప్పేందుకు.. పోరాటాల బాట ఎంచుకున్నట్లుగా ఉన్నారు.
కర్ణాటకలో.. పెట్టే ఏ పరిశ్రమలో అయినా కన్నడిగులకే ఉద్యోగాలివ్వాలనే డిమాండ్‌తో ఉపేంద్ర.. ప్రారంభించబోతున్న ఉద్యమం.. తెలుగువాళ్లపైనే ప్రధానంగా ఎఫెక్ట్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. అవడానికి కర్ణాటక రాజధాని అయినప్పటికీ… ఆంధ్రప్రదేశ్‌తో బెంగళూరు నగరం బోర్డర్ ఎక్కువగా ఉంటుంది. దాంతో.. అనంతపురం, కడప, చిత్తూరు వాసులకు..ఉపాధి అవకాశాల రాజధానిగా బెంగళూరు మాత్రమే ఉంది. ప్రభత్వానికి సంబంధించిన వ్యవహారాలు మాత్రం… ఏపీ రాజధానిలో చూసుకుంటారు కానీ.. ఉపాధి ఇతర అవసరాలు మొత్తం బెంగళూరు మీదనే ఆధారపడతారు. అదే సమయంలో.. బెంగళూరు ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగుల్లో.. అత్యధికులు తెలుగువారే. హైదరాబాద్ ఐటీ పరిశ్రమల్లో.. ఉత్తరాది వారు ఎక్కువగా కనిపిస్తారు కానీ.. బెంగళూరులో మాత్రం.. తెలుగువారే ఉంటారు.
ఉపేంద్ర ఉద్యమం ఊపందుకుంటే.. కన్నడ నాట అలజడి చెలరేగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ కన్నడ భాషా ప్రేమికులు, వాటికి సంబంధించిన సంఘాలు తరచూ రేపే అలజడి కలకలం రేపుతూ ఉంటాయి. ఇప్పుడు… ఉపేంద్ర ఉద్యమం ప్రారంభించి.. ప్రజల్లో కదలిక తేవడం ద్వారానో.. లేక ఇప్పుడున్న ప్రభుత్వాలో.. రాజకీయాల్లో లబ్ది కోసమో… ప్రతిపక్ష పార్టీలో… కన్నడ నాట పెట్టే పరిశ్రమల్లో ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగావకాశాలు ఇవ్వకూడదని చట్టం తెస్తామని హామీ ఇస్తే.. తెలుగువాళ్లకి.., బెంగళూరుతో.. కర్ణాటకతో రుణం తీరిపోయినట్లు అయిపోతుంది. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలకు గండి పడుతుందనే ఆందోళన ఉంది. మరి ఉపేంద్ర ఉద్యమం.. ఎంత మేర ప్రజల్లోకి వెళ్తుందనేదే అసలు విషయం.