కాంగ్రెస్ పార్టీ పగ్గాలను మరోసారి సోనియా గాంధీకే నాయకులు అప్పగించారు. రాహుల్ గాంధీ రాజీనామా తరువాత అధ్యక్షుడుని ఎన్నుకునే క్రమంలో ఆలస్యం జరుగుతోంది. దీంతో కర్ణాటకలో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇలాంటి నష్టాలు ఇంకా పెరగకుండా ఉండాలంటే… తాత్కాలికంగా సోనియాకి బాధ్యతలు అప్పగించక తప్పదు అనే పరిస్థితి వచ్చింది. కొంతమంది వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించి, సీనియర్లు వెనక ఉంటూ కొన్నాళ్లపాటు పార్టీని నడిపిస్తారని సమాచారం. అయితే, రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలకు దూరం కావడంతో… పార్టీలో యువ నాయకత్వం మాటేంటనేది ఇప్పుడు చర్చనీయం అవుతోంది.
ప్రస్తుతం రాహుల్ గాంధీ ఏం చేయబోతున్నారు అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఆయన సైనికుడిగా పోరాడతారని ఇతర నేతలు చెబుతున్నా… ఆయన్నే నమ్ముకుని వచ్చిన యువ నాయకుల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఇంకో చర్చనీయాంశం. జ్యోతిరాద్య సింధియా, సచిన్ పైలెట్, మిలింద్ దేవ్ రా… ఇలా కొంతమంది యువ నాయకులు ఒకప్పుడు రాహుల్ గాంధీ టీమ్ గా ఉండేవారు. ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేయడంతో… వీళ్లు కూడా అదే బాటలో పార్టీ పదవులకు రాజీనామా చేశారు. అందరూ కలిసి మరోసారి రాహుల్ గాంధీని ఒప్పిస్తారనే అభిప్రాయమే ఉండేది. అయితే, ఆయన ససేమిరా అనేయడంతో ఇప్పుడు ఈ యువ నాయకుల పరిస్థితి ఏంటనేది వేచి చూడాలి. రాహుల్ కి బదులుగా మళ్లీ గాంధీ కుటుంబం చేతిలోనే పార్టీ పగ్గాలు ఉండటం వీరికి ఇష్టమా కాదా అనేదీ ప్రశ్నే? రాహుల్ స్ఫూర్తితో పదవులు వదులుకున్న యువ నాయకులకి మళ్లీ ఆ పదవులు ఇస్తారా, కొత్తవారిని భర్తీ చేస్తారా అనేదీ చూడాలి.
కర్ణాటకలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కొంతమంది నాయకుల కాంగ్రెస్ ని వదిలి వెళ్లిపోయారు. అలా వెళ్లిన ద్వితీయ శ్రేణి నాయకుల్లో యువ నాయకులు చాలామంది ఉన్నారు. వెళ్లిపోయినవారిని మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చేందుకు రాహుల్ గాంధీ చొరవ తీసుకుంటారా లేదా అనేది చూడాలి. రాహుల్ అధ్యక్ష పదవికి దూరం కావడంతో పార్టీలో ఆయన్నే నమ్ముకున్న యువ నాయకత్వం ఇప్పుడు నీరసించే అవకాశం కనిస్తోంది. తన పనేదో తాను చేసుకుంటానని రాహుల్ కూర్చుంటే యువ నాయకత్వమంతా మరింత డీలా పడే అవకాశం ఉంది.