ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆలయాల భూములను.. స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దేవాదాయశాఖ అధీనంలో ఉన్న ఆలయాలకు సంబంధించిన … కొన్ని వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని.. వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలని… ప్రభుత్వ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపుగా పదివేల ఎకరాలు ఈ మేరకు గుర్తించినట్లుగా చెబుతున్నారు. వచ్చే ఏడాది ఉగాది నాటికి ఇరవై ఐదు లక్షల మంది పేదలకు ఒకే సారి ఇళ్ల పట్టాలివ్వాలనే నిర్ణయం తీసుకుంది. ఎంత ఖర్చు అయినా సరే చేపట్టాలని నిర్ణయించుకుంది. స్థలాల సేకరణ, గుర్తింపు కోసం రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ని నియమించారు. సభ్యులుగా ఆర్ధిక, సామాజిక సంక్షేమ శాఖ, గృహ నిర్మాణశాఖల కార్యదర్శులు ఉన్నారు. కన్వీనర్‌గా భూపరిపాలనశాఖ ప్రత్యేక కమిషనర్‌ను నియమించారు..
ఇళ్ల స్థలాలకు ఆలయాల భూములు తీసుకోవాలనే ప్రతిపాదన..!
ప్రభుత్వం నియమించిన కమిటీ.. పూర్తి స్థాయిలో… పరిశీలన జరిపి.. పదివేల ఎకరాల దేవాదాయ భూముల్ని తీసుకుంటే.. కొంత వరకు.. ఖర్చు తగ్గించుకుని… పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వవొచ్చని.. నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం 11,140 ఎకరాల ప్రభుత్వ స్థలాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేని చోట… దేవాదాయ భూములు.. అవి లేకపోతే.. ప్రైవేటు స్థలాల కొనుగోలు కోసం.. ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సు చేయనుంది. అర్హులందరికీ ఇంటి స్థలం ఇచ్చి తీరుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవి ప్రమాణం చేసినప్పటి నుంచి చెబుతున్నారు.
25 లక్షల మందికి ఇళ్ల స్థలాలివ్వలంటే.. 83వేల ఎకరాలు అవసరం..!
25 లక్షల మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వడానికి 83,833 ఎకరాలు అవసరమని, ఇందుకు రూ.40 వేల కోట్లు అవసరమవుతాయని రెవెన్యూ శాఖ చెబుతోంది. ఇప్పుడు కమిటీ.. రెవిన్యూ శాఖ నివేదికను.. సమీక్షించి. వీలైనంత తక్కువలో… ఇళ్ల స్థలాల పంపిణీని పూర్తి చేసే అవకాశాలను పరిశీలించనుంది. సీఎం జగన్ ఇంటి స్థలాల పంపిణీ విషయంలో పట్టుదలగా ఉన్నారు. పట్టాలు ఇచ్చి స్థలాలెక్కడో చూపని పరిస్థితి ఉండకూడదని… ఏయే గ్రామాల్లో ఎంతమందికి ఇంటి స్థలాలు లేవో గ్రామ వలంటీర్లు లెక్క తీస్తారనిప్రకటించారు. ఈ క్రమంలో… ప్రభుత్వానికి… దేవాదాయ భూములే ప్రధానంగా హామీని నెరవేర్చడానికి ఉపయోగపడతాయనే అంచనా ఉంది.
ఆలయ భూముల్ని కదిలిస్తే.. వివాదమే..!?
అయితే.. దేవాదాయ భూముల్ని.. తీసుకుంటే.. ఆలయాల పోషణ ఏమవుతుందన్న చర్చ సహజంగానే వస్తుంది. చాలా మంది.. ఇప్పటికే.. దశాబ్దాలుగా ఆలయభూముల్ని కౌలు చేసుకుంటూ.. ఆయా ఆలయాలకు.. ఆదాయాన్ని ఇస్తున్నారు. ఈ క్రమంలో… అలాంటి భూముల్ని స్వాధీనం చేసుకోవడం వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంది. మరి దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో.. వేచి చూడాలి..!