ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు ఎలాంటి పరిశ్రమ పెట్టాలనుకున్నా… 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాల్సిందేనని… చట్టం చేశారు. ఈ ప్రాంతీయాభిమానం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. సాధారణంగా.. పారిశ్రామికీకరణ విపరీతంగా జరిగి.. ఇతర చోట్ల నుంచి పెద్ద ఎత్తున వలసలు వచ్చి.. స్థానికులకు అవకాశాలు దక్కడం లేదన్న భావన బలంగా ఉన్నప్పుడే… ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. కానీ ఏపీలో పరిశ్రమలు రావాల్సిన సమయంలో ఈ చట్టం చేశారు.
కర్ణాటకలో కన్నడిగులకే ఉద్యోగాలు..! యడియూరప్ప మద్దతు..!
కన్నడ స్టార్ ఉపేంద్ర ప్రారంభించిన ఉద్యమానికి.. సీఎం యడియూరప్ప మద్దతు పలికారు. కర్ణాటకలో.. కన్నడిగులకే ఉద్యోగాలివ్వాలనే.. ఉపేంద్ర డిమాండ్ కు సంఘిభావం తెలిపారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినట్లుగా చట్టం చేయకుండా ఉండే అవకాశం లేదు. అలా.. ఆయన చట్టం చేసిన రోజున.. రోడ్డున పడిదే..ఆంధ్రప్రదేశ్ యువతే. ఆంధ్రప్రదేశ్‌తో కర్ణాటక బోర్డర్ ఎక్కువగా ఉంటుంది. దాంతో.. అనంతపురం, కడప, చిత్తూరు వాసులకు..ఉపాధి అవకాశాల రాజధానిగా బెంగళూరు మాత్రమే ఉంది. బెంగళూరు ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగుల్లో.. అత్యధికులు తెలుగువారే. హైదరాబాద్ ఐటీ పరిశ్రమల్లో.. ఉత్తరాది వారు ఎక్కువగా కనిపిస్తారు కానీ.. బెంగళూరులో మాత్రం.. తెలుగువారే ఉంటారు. ఈ ఎఫెక్ట్ వారందరిపై పడనుంది.
పరిశ్రమలున్న చోట వాళ్లకే ఇస్తే.. ఏపీ యువతకి ఎవరిస్తారు..?
ఏపీలో ఎలాంటి పారిశ్రామీకకరణ లేదు. వెల్లువలా వస్తున్న పరిశ్రమలు లేవు. విభజన తర్వాత ఏపీ పారిశ్రామికీకరణలో వెనుకబడింది. భారీగా పరిశ్రమలను ఆకర్షించి.. అంతో ఇంతో ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తున్న దశలో.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 75శాతం స్థానికులకే ఉద్యోగాలనే చట్టం తెచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో… ఏ జిల్లాలోనూ యువత… చదువు పూర్తయిన తర్వాత… సొంత ప్రాంతం.. లేదా సొంత జిల్లాలో ఉద్యోగం చేసుకునే వెసులుబాటు లేదు. చదివిన చదువుకు తగ్గట్లుగా… ఉపాధి అవకాశాలు పొందాలంటే… జిల్లాలు, రాష్ట్రాలు దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ యువత ఇప్పుడు.. ఇతర రాష్ట్రాలకు ఉద్యోగం కోసం వెళ్తే.. అక్కడి యాజమాన్యాలు ప్రధానంగా ఎదురయ్యే ప్రశ్న.. మీ రాష్ట్రంలోనే 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తున్నప్పుడు… తాము ఎందుకు రిక్రూట్ చేసుకోవాలనేదే. ఇవ్వాలనే చట్టం ఉంది కానీ.. ఇచ్చే కంపెనీలు.. పరిశ్రమలు లేవని.. ఆ నిరుద్యోగులు ..ఎలా సమర్థించుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు.
ఏపీ యువతకి జగన్ మేలు చేశారా..? కీడు చేశారా..?
పారిశ్రామికీకరణలో ముందున్న తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణల్లో .. ఈ వ్యవహారం సెగలు రేపడం ఖాయంగా కనిపిస్తోంది. పొరుగు రాష్ట్రం చట్టం చేసినప్పుడు.. మీరెందుకు చేయరని అక్కడి ప్రభుత్వాలపై.. ప్రతిపక్షాలు ఒత్తిడి చేయడం ఇప్పటికే ప్రారంభించాయి. ఎన్నికల సమయానికి.. ఈ డిమాండ్లు మేనిఫెస్టోలకు ఎక్కినా ఆశ్చర్యం లేదు. ఉపేంద్ర లాంటి వాళ్లు ప్రారంభించే ఉద్యమాలతో… ఈ స్థానికులకే ఉద్యోగావకాశాలు అనే నినాదం.. మరింత విస్తరిస్తుంది. దీని వల్ల పాలకులకు నష్టం జరగదు. రెచ్చగొట్టే రాజకీయ పార్టీలకు నష్టం జరగదు. కానీ.. ఉన్న చోట ఉపాధి దొరక్క.. ఇతర చోట్లకు వెళ్లి బతుకుదామనుకునే యువతకే నష్టం జరుగుతుంది.