కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం… తన జాతి రిజర్వేషన్ల కోసం ఎవరితో పోరాడాలన్న కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లుగా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో.. చంద్రబాబు ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లను క్యాన్సిల్ చేసిన జగన్‌ను నిందించారో… చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన.. ఐదు శాతం కోటా రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించలేదని.. ప్రధాని మోడీని డిమాండ్ చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నట్లుగా.. తాజా లేఖలు బయట పెడుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీకి.. ముద్రగడ పద్మనాభం నేడు ఓ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఏమిటంటే.. చంద్రబాబు.. కాపులను బీసీల్లో చేర్చుతూ.. ఐదు శాతం కోటా ఇచ్చారని.. ఆ కోటాకు ఆమోద ముద్రవేయాలని.. కోరడం. లేఖలో.. గతంలో కాపులకు రిజర్వేషన్లు ఉండేవని.. తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి తీసేశారని మొదటగా గుర్తు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు ఇచ్చిన రిజర్వేషన్లకు ఆమోద ముద్ర వేయాలని కోరారు.
ఇటీవలి కాలంలో ముద్రగడపై ఒత్తిడి పెరుగుతోంది. చంద్రబాబు ఇచ్చిన రిజర్వేషన్లు జగన్ క్యాన్సిల్ చేసినా.. ఎలాంటి పోరాట ప్రణాళిక ప్రకటించడం లేదని.. సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఏ కోర్టు కొట్టి వేయనప్పటికీ.. ఎందుకు… ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాల్సి వచ్చిందో… ముద్రగడ లేఖ రాసినా.. ప్రభుత్వం పట్టించుకోలేదు. అయినా ముద్రగడ లైట్ తీసుకున్నారు. రిజర్వేషన్ల కోసం.. ఏదో ఓ ఉద్యమం చేయాలని… ఆయనపై ఒత్తిడి వస్తోందని చెబుతున్నారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ సర్కార్ పై ఉద్యమం చేయడానికి ఆయన సిద్దంగా లేరని… అందుకే.. వీలైనంతగా.. దాన్ని కేంద్రం వైపు మళ్లించాలని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.
ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ పీఎంవోకి చేరుతుందో లేదో కానీ… ఆయన.. తెలుగులో లేఖ రాశారు. ప్రధాని.. లేదా.. ఇతర ఢిల్లీ స్థాయి వ్యవహారాల్లో అధికార ఉత్తరాలు.. ఇంగ్లిష్‌లోనే రాస్తారు. అలా రాస్తేనే.. కాస్త వెసులుబాటు అక్కడ ఉండే అధికారులకు ఉంటుంది. లేకపోతే.. ప్రాధాన్యత క్రమంగా పక్కన పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే.. ముద్రగడ మాత్రం.. ఎప్పుడు.. ఎవరికి లేఖలు రాసినా.. తెలుగులోనే రాస్తారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకూ అయితే.. ఎవరూ పట్టించుకోరు కానీ.. మోడీకి కూడా.. తెలుగులోనే రాస్తూండటంతో.. ఆయన చిత్తశుద్ధి మీద… కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు.