బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కి పాకిస్తాన్ వీసా నిరాకరించడంతో దానికి భారత్ కూడా అదే విధంగా ఏదో చేస్తుందని అందరూ ఊహించారు కానీ ఇంత త్వరగా చేస్తుందని ఎవరూ ఊహించలేదు. పాకిస్తాన్ జాతీయ విమాన సంస్థ అయిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పి.ఐ.ఏ) భారత్-పాకిస్తాన్ మధ్య విమానాలు నడుపుతోంది. వాటిలో వారానికి మూడు చొప్పున డిల్లీ నుండి రెండు ముంబై నుండి నడుస్తున్నాయి. డిల్లీ, ముంబైలలో పి.ఐ.ఏ స్టేషన్ మేనేజర్లుగా పనిచేస్తున్న సయీద్ అహ్మద్ ఖాన్ మరియు షబ్బీర్ అహ్మద్ ల వీసాల గడువు జనవరి మొదటి వారంలో పూర్తయిపోయింది. భారత ప్రభుత్వం వారిరువురికీ మళ్ళీ వీసాలు జారీ చేయవలసి ఉంది. కానీ ఇంత వరకు వారికి వీసాలు జారీ చేయకపోవడంతో వారిద్దరూ భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్నట్లు అయింది.
వారిద్దరికీ తక్షణమే వీసాలు జారీ చేయాలని పి.ఐ.ఏ సంస్థ, పాక్ ప్రభుత్వం కూడా భారత్ కి విజ్ఞప్తి చేసాయి. వారిలో సయీద్ అహ్మద్ ఖాన్ కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడని, కనుక మానవతా దృక్పధంతో తక్షణమే వీసాలు జారీ చేయాలని పాక్ విజ్ఞప్తి చేసింది. కానీ భారత్ ఎందుకో ఇంతవరకు స్పందించలేదు. వీసాలు లేని కారణంగా వారిరువురూ భారత్ లో తమ బాధ్యతలు నిర్వర్తించలేక, స్వదేశానికి తిరిగి వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భారత్ తీరును పాక్ తీవ్రంగా నిరసిస్తూ తక్షణమే వారికి వీసాలు జారీ చేయాలని కోరింది. లేకుంటే రెండు దేశాల ప్రజల సంబంధాలు దెబ్బ తింటాయని హెచ్చరించింది. అనుపమ్ ఖేర్ వీసా సమస్య మొదలవడానికి చాలా రోజుల ముందు అంటే జనవరి మొదటి వారంలోనే పి.ఐ.ఏ అధికారుల వీసాల గడువు ముగిసిపోయింది కనుక ఈ రెంటికీ సంబంధం ఉండకపోవచ్చును. కానీ అనుపమ్ ఖేర్ వ్యవహారం జరిగిన వెంటనే ఇది బయట పడటంతో అందరూ సహజంగానే దీనిని ప్రతీకార చర్యగానే భావించే అవకాశం ఉంది. కనుక పి.ఐ.ఏ విమాన సంస్థ అధికారులకు వీసాలు ఇవ్వకపోవడానికి ఎందుకు నిరాకరిస్తోందో తెలియజేయవలసిన బాధ్యత భారత్ పైనే ఉంది.