వైకాపా సర్కారు త్వరలోనే రైతు భరోసా పథకాన్ని అమలు చేయనుంది. అక్టోబర్ 15 న ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా అందరూ ఈ కార్యక్రమంవైపు తిరిగి చూసేలా చేయ్యాలంటూ అధికారులకు చెప్పారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రైతు భరోసా అమలు షెడ్యూల్ ని ముఖ్యమంత్రి వివరించారు. ఈసారి మాత్రమే రబీకి రైతు భరోసా ఇస్తున్నామనీ, వచ్చే ఏడాది నుంచి మే నెలలోనే ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. దాంతో ఖరీఫ్ పంటకు ప్రభుత్వం భరోసా ఇచ్చినట్టు అవుతుందని జగన్ అన్నారు. గ్రామ సచివాలయమే కౌలు రైతులకు కార్డులు జారీ చేస్తుందన్నారు.
రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రధాని చేతులు మీదుగా ప్రారంభించాలనుకోవడం.. కచ్చితంగా ప్రాధాన్యత సంతరించుకునే అంశమే అవుతుంది. ఎందుకంటే, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత ఒక అధికారిక కార్యక్రమానికి ఆంధప్రదేశ్ కు ప్రధాని వస్తున్నట్టు అవుతుంది. ఈ మధ్య కొన్ని పరిణామాలు చూసుకుంటే… జగన్ సర్కారుకి కేంద్రంలోని మోడీ సర్కారుకు మధ్య కొంత గ్యాప్ పెరుగుతోందనే వాతావరణం కనిపిస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ కేంద్రాన్ని వైకాపా డిమాండ్ చేస్తుంటే…. ఇవ్వడం అసాధ్యమని పదేపదే భాజపా నేతలు చెబుతున్న పరిస్థితి. పరిశ్రమలకు రాయితీలు అడిగితే… ప్రత్యేకంగా ఎలాంటి సాయమూ చేయలేమని చేతులెత్తోస్తోన్న పరిస్థితి ఉంది. పీపీయేల రద్దు లాంటి అంశాల్లో కూడా కేంద్రం వైఖరి వేరేలా ఉంది. ఇలాంటి నేపథ్యంలో వైకాపా సర్కారు రాష్ట్రంలో ప్రారంభిస్తున్న కార్యక్రమానికి మోడీ వస్తే, కేంద్రం వైఖరి ఏంటనేది దాదాపు స్పష్టమైనట్టు అవుతుంది.
ఇక, ఎన్నికల ముందు పాదయాత్రతో, ప్రచార కార్యక్రమాలతో నిత్యంలో ప్రజల్లో ఉంటూ వచ్చిన సీఎం జగన్… ఇప్పుడు మరోసారి జిల్లాల పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమౌతున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అన్ని జిల్లాల్లో ఆయన పర్యటించే అవకాశం ఉందని సమాచారం. ఈ పర్యటన షెడ్యూల్ ను త్వరలోనే సీఎంవో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. గ్రామ వలంటీర్ల ఏర్పాటుతోపాటు, పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల అమలుకు వరుసగా జగన్ సర్కారు సిద్ధమౌతోంది. ఈ పథకాల ప్రారంభోత్సవాలతోపాటు.. ప్రజలను కలుసుకుని, సమస్యలు తెలుసుకునే దిశగా ఈ పర్యటన ఉండే అవకాశం ఉంది.