భాజపా తీరు చూస్తుంటే… కనకపు సింహాసనమున… అంటూ ఓ సుమతీ శతక పద్యం గుర్తొస్తోంది..! రెండోసారి తిరుగులేని అధికారాన్ని భాజపాకి ప్రజలు కట్టబెట్టారు. ప్రధాని మోడీని తిరుగులేని నాయకుడిగా ప్రజలు మరోసారి ఆమోదించారు. ఈ మధ్యనే కాశ్మీరులో ఆర్టికలో 370 రద్దులాంటి సాహసోపేత నిర్ణయం తీసుకుని, మెజారిటీ ప్రజల మన్ననలు పొందారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేశారు. ఇలా భాజపా రాజకీయ గ్రాఫ్ పెరుగుతుంటే… మరోపక్క, రాజకీయంగా భాజపా ఇంకా అవే నేలబారు ఎత్తుగడలు, అవే ఫిరాయింపు రాజకీయాలు. వీలైతే ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోలేవాలి, లేదంటే ఇతర పార్టీల్లో గెలిచిన వారిని లాక్కుని అధికారం దక్కించుకోవాలి! ఇదే మూల సూత్రాన్ని ఇంకా వదులుకునేందుకు భాజపా సిద్ధంగా లేదనడానికి సిక్కింలో చోటు చేసుకున్న పరిణామాలే మరో తాజా ఉదాహరణ.
సిక్కింలో భాజపాకి ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేదు! కానీ, ఇవాళ్ల… ఒకేసారి 10 మంది ఎమ్మెల్యేలున్నారు! ఎలా అంటే, ఏముంది… కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి, లాక్కున్నారు. అక్కడ ప్రతిపక్ష పార్టీగా ఉన్న సిక్కిం డెమొక్రటిక్ ఫ్రెంట్ నుంచి పది మంది శాసన సభ్యులను భాజపా ఆకర్షించింది. ఇప్పుడా పార్టీలో ముగ్గురే మిగిలారు. ఆ పదిమందీ జేపీ నడ్డా, రామ్ మాదవ్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అంటే, ఉన్నపళంగా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా భాజపా అవతరించింది. ఎన్నికల్లో పాల్గొనలేదు, కమలం గుర్తుమీద ఎవ్వరూ గెలవలేదు, భాజపా అంటే ఏంటో ఆ రాష్ట్ర ప్రజలకు తెలీదు.. కానీ, ఇప్పుడు సిక్కింలో భాజపా ప్రతిపక్షం! ఇక అధికార పార్టీ సిక్కిం క్రాంతి మోర్చా పరిస్థితి కూడా తుమ్మితే ఊడిపోయే ముక్కులానే ఉంది. ఆ రాష్ట్రంలో మొత్తం 32 అసెంబ్లీ సీట్లుంటే.. అధికార పార్టీకి ఉన్నవి 17 మాత్రమే. అధికార పార్టీలో ఉన్నవారిలో కొందర్ని ఇటువైపు లాక్కుకోవడం భాజపాకి పెద్ద కష్టమైన, అసాధ్యమైన, అలవాటులేని పనైతే కాదు కదా!
ఈ తాజా ఫిరాయింపుల పర్వం వెనక రచనా నిర్మాణం స్క్రీన్ ప్లే దర్శకత్వం రామ్ మాధవ్. పార్టీని బలోపేతం చేయడమంటే.. సిద్ధాంతపరంగా, నైతికంగా భావజాలపరంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చెయ్యాలి. అంతేగానీ, బలహీన పార్టీల సభ్యులను నయానో భయానో ఏవో ఆశలు చూపి లాక్కోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి గండి కొట్టడమే అవుతుంది. నేరుగా ఎన్నికల్ని ఎదుర్కొని.. రాజాలా తలెత్తుకుని గెలవగలిగే సత్తా ఉన్నప్పుడు… ఇంకా ఈ దొడ్డిదారి రాజకీయాలేంటి..? కేంద్రంలో అధికారంలో ఉన్నామనే కారణాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఇంకా ఇలాంటి చౌకబారు రాజకీయాలే చేస్తుంటే… అధికార పార్టీగా ఎన్ని గొప్ప నిర్ణయాలైనా తీసుకోవచ్చుగాక, నైతికంగా భాజపా బుద్ధి ఇంకా బుదరలోనే పొర్లాడుతోందనే అభిప్రాయం ప్రజల్లో బలపడే అవకాశం కచ్చితంగా ఉంది.