రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలన కొనసాగుతోందని భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజల ఆకాంక్షల కోసం తెలంగాణ వస్తే, ఇప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆకాంక్షల కోసం ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. అయితే, ఈ విమర్శకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. అవు… కేసీఆర్ కుటుంబ పాలనే, అయితే ఏంది అంటూ లక్ష్మణ్ కి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నది కల్వకుంట్ల ఫ్యామిలీ సర్కారేననీ, దాన్లో ఎలాంటి అనుమానం లేదని ఆయన సమర్థించారు. పరిపాలించే వ్యక్తి పేరు మీదనే ప్రభుత్వాలు నడుస్తాయని లక్ష్మణ్ కి తెలియదా అంటూ తలసాని వ్యాఖ్యానించారు.
కేంద్రంలో ఉన్నది మోడీ సర్కారే అంటారుగానీ, బీజేపీ ప్రభుత్వం అనరు కదా అని చెప్పారు! కేసీఆర్ కుటుంబంపై ఏడ్వడం భాజపా నేతలకు అలవాటైపోయిందన్నారు. ఎం.ఐ.ఎమ్.ని వెనకేసుకొస్తూ… మాతో దోస్తీ ఉందని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం భాజపా చేస్తోందన్నారు. పుల్వామా దాడి తరువాత భాజపాకి మద్దతు తెలపలేదా, మజ్లిస్ ఎంపీ ఇండియన్ పార్లమెంటు సభ్యుడు కాదా అంటూ నిలదీశారు. రాష్ట్రంలో ఎదిగిపోతామని భాజపా కలలు కంటోందనీ, ఎప్పటికీ తెరాస నంబర్ వన్ అనీ, రెండో స్థానం కోసం భాజపా, కాంగ్రెస్ లు కొట్టుకుంటూ ఉంటాయన్నారు. షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయనీ, తెరాస ఘన విజయాన్ని మరోసారి సాధించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎవరు పాలిస్తే… ఆ వ్యక్తి పేరు మీదే ప్రభుత్వాలు ఉంటాయని తలసాని చెప్పడం విడ్డూరంగా ఉంది! అధికార పార్టీ అంటారుగానీ, అధికారంలో ఉన్న వ్యక్తి అనేది మన దగ్గర ఎక్కడా లేదు. మోడీ సర్కారు, కేసీఆర్ సర్కారు అనేది మనం వాడులో మాట్లాడుకుంటున్న పదాలు. అంతేగానీ.. మరీ తలసాని చెప్పినట్టే పాలించిన వారి పేరునే ప్రభుత్వాలుంటాయనేది సరైంది కాదు. ఇంకోటి… కేంద్రంలో మోడీ సర్కారు అనడం తప్పులేదనీ, అలాగే రాష్ట్రంలో కల్వకుంట్ల ఫ్యామిలీ సర్కారు అనడమూ సరైందే అని ఎలా సమర్థిస్తారు? అధికారంలో ఉన్న వ్యక్తి వేరు… ఆ వ్యక్తికి ఉన్న కుటుంబం మొత్తానికి అధికారం ఆపాదించడం వేరు కదా! ప్రజలు కుటుంబాలను ఎన్నుకోరు కదా..? తలసాని చేసిన ఈ స్టేట్మెంట్ లో లాజిక్ లేదు! వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలన గురించి సమర్థించుకునే విధంగా వ్యాఖ్యానాలు చేయాలనుకోవడమే కరెక్ట్ కాదు. ఎందుకంటే, మనది ప్రజాస్వామ్య దేశం. కానీ, వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలనలాంటివి అనివార్యమైపోయింది తప్ప, అదేదో రాజకీయ సంప్రదాయం కానే కాదు.