ఈనెల 18 పెద్ద సంఖ్యలో ఇతర పార్టీల నేతలు భాజపాలో చేరుతున్నట్టు ఆ పార్టీ ఇటీవలే ప్రకటించింది. హైదరాబాద్ లో జరిగే సభకు భాజపా జాతీయ నేత జేపీ నడ్డా వస్తున్నారు. ఆయన సమక్షంలో దాదాపు 20 మందిని చేర్చే పనిలో రాష్ట్ర కమలనాథులున్నారు. ఇంతవరకూ టీడీపీ, కాంగ్రెస్ నేతల మీద మాత్రమే భాజపా ఫోకస్ ఉంటూ వచ్చింది. ఆ రెండు పార్టీల నాయకుల్నే ప్రధానంగా ఆకర్షించింది. అయితే, తాజా లక్ష్యం అధికార పార్టీ తెరాస కూడా ఉందనేది తెలుస్తోంది. తెరాస నుంచి కొద్ది ఎమ్మెల్యేలనైనా ఈ సందర్భంలో ఆకర్షించగలిగితే… మున్సిపల్ ఎన్నికల్లో భాజపాకి బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో తెరాస ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ మారతారా..? అలాంటి అవకాశం ఉందా..? అధికారంలో ఉన్నప్పుడు బయటకి వచ్చేవాళ్లు ఎవరుంటారు అనేవి చర్చనీయాంశాలు.
భాజపా లక్ష్యం ఏంటంటే… తెరాసలో కాస్త అసంతృప్తిగా ఉన్నవారు, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా దక్కనివారు, కేటీఆర్ ప్రాధాన్యత ఇవ్వనివారు, అధికారంలో ఉండి కూడా అధినాయకత్వం అనుమతులు లభించక పనులు చేసుకోలేనివారు… ఇలాంటివారిని టార్గెట్ చేసుకున్నట్టు సమాచారం. గ్రేటర్ పరిధిలో శివారు నియోజకవర్గాలకు చెందిన ఓ ముగ్గురు ఎమ్మెల్యేలు, కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు, నిజామాబాద్ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని భాజపా నేతలు లీకులిస్తున్నారు. ఆదిలాబాద్, మెదక్ నుంచి కూడా ఒక్కొక్కరున్నారట! ఉమ్మడి వరంగల్ లో తెరాస మీద తీవ్ర అసంతృప్తితో ఉన్న ఒక నేత, సొంత పార్టీపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్న నల్గొండ జిల్లాకి చెందిన ఇంకో ఎమ్మెల్యే… వీళ్లు కూడా భాజపాకి టచ్ లో ఉన్నారట! రాష్ట్ర భాజపా నేతలు వీరితో టచ్ లోకి వెళ్లారనీ, తమకు సరైన న్యాయం జరుగుతుందంటే ఆలోచిస్తామని వారు కూడా చెప్పారంటూ కమలం పార్టీ లీకులు ఇస్తోంది.
ఈ ప్రకటనలు భాజపా మైండ్ గేమ్ అనుకున్నా… సొంత పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతల విషయంలో తెరాస కూడా అప్రమత్తమైందని తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ ద్వారా ఎమ్మెల్యేల కదలికలపై నిఘా వేసి ఉంచిందనీ, వారి విషయంలో జాగ్రత్తపడుతోందనీ తెరాస వర్గాలే అంటున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు ముందు ఏ ఒక్కరూ చేజారకూడదనే అప్రమత్తత ఆ పార్టీలోనూ ఉందని తెలుస్తోంది. నిజానికి, అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి… అధినాయకత్వంపై ఎంత అసంతృప్తి ఉన్నా ఇప్పటికిప్పుడు భాజపాలోకి వెళ్లడం ద్వారా రాజకీయంగా ప్రయోజనం ఉండకపోవచ్చు. అయితే, కేంద్రంలో భాజపా అధికారంలోకి ఉంది కాబట్టి, కాంట్రాక్టులు లాంటి ఇతర ప్రయోజనాలను భాజపా ఎరగా వేసే అవకాశం ఉంటుంది. తెరాస నుంచి కొద్దిమందినైనా రప్పించడంలో సక్సెస్ అయితే భాజపాకి మంచి మైలేజ్ వచ్చినట్టే కదా!