బీజేపీ ఇప్పుడు.. చేరికల మోడ్లో ఉంది. తెలంగాణలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా.. అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ సహా.. అధికార టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్త నేతలకు సైతం బీజేపీ నేతలు కాషాయ కండువా కప్పుతున్నారు. కానీ వారంతా ఉత్తినే బీజేపీలో చేరడం లేదు. దాని కోసం.. బీజేపీ వారికి… సైజుకు మించి ఆఫరిస్తోందనే ప్రచారం జరుగుతోంది. అయితే అందరికీ ఒకే రకమైన హామీ ఇవ్వడమే.. గతంలో చేరిన వారిని.. ఇప్పుడు చేరబోతున్న వారిని… ఆందోళనకు గురి చేస్తోంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… తాను బీజేపీలోకి వెళ్తే సీఎం అభ్యర్థినని ప్రకటించుకున్నారు. ఆయనకు అలాంటి ఆశలు కల్పించారు. తీరా ఆయన బయటకు చెప్పుకునేసరికి సీన్ రివర్స్ అయింది. కానీ చాలా మందికి గుంభనంగా అదే తరహా హామీలిచ్చారు. డీకే అరుణ, పొంగులేటి సుధారకర్ రెడ్డి, జితేందర్ రెడ్డి. వివేక్, పెద్దిరెడ్డి, బోడ జనార్థన్, చాడ సురేష్ రెడ్డి లాంటి నేతలు బీజేపీలో చేరిపోయారు. మోత్కుపల్లి ని ఆయన నివాసానికి వెళ్లి మరీ ఆహ్వానించారు. ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడంటే అప్పుడు కండువా వేసుకుంటారు. పార్టీలో చేర్చుకునేందుకు ఏమేం కావాలో.. రాం మాధవ్, మురళీధర్ రావులు చర్చలు జరుపుతున్నారు.
జితేందర్ రెడ్డి ఎన్నికలకు ముందు బీజేపీలో చేరినప్పుడు.. ఆయనతు తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవి తో పాటు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారు. ఆ హామీ మేరకే ఆయన బీజేపీలో చేరారు. డీకే అరుణకు కూడా దాదాపుగా అదే హామీ ఇచ్చారు. వివేక్ కు రాజ్య సభ సీటు ఆఫర్ చేశారు. టీడీపీ నుంచి మాజీ మంత్రులు ఇనుగాల పెద్దిరెడ్డి, బోడచజనార్థన్, మాజీ ఎంపీ ఛాడ సురేష్ రెడ్డిలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కూడా పెద్ద హామీలే ఇచ్చినట్లు వినికిడి. టీడీపీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి ఈనెల 18న టీడీపీ క్యాడర్ ను .. జేపీ నడ్డా సమక్షంలో పెద్ద ఎత్తున బీజేపిలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాజ్య సభ సభ్యునిగా ఉన్న గరిక పాటికి మళ్లీ రాజ్య సభ పదవికి పార్టీ నుండి నామినేట్ చేస్తామని హామి ఇచ్చారట. ఇక విజయశాంతికి రాజ్యసభ, దామోదర్ రాజనర్సింహకు.. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఆఫర్ చేశారు. వారూ టెంప్ట్ అవుతున్నారు. ఆ పదవులన్నీ బీజేపీ హైకమాండ్ ఎలా ఇస్తుందనేది ఎవరికీ అర్థం కావడం లేదు.