ఆంధ్రప్రదేశ్లో కలసిపోయిన దళారీ వ్యవస్థ, అధికారం, అవినీతిని ప్రక్షాళన చేసి.. పేద మధ్యతరగతి ప్రజలందరికీ సంక్షేమాన్ని అందిస్తామని.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి… ఆగస్టు పదిహేను సందేశం ఇచ్చారు. విజయవాడలో జెండా వందనం చేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత ప్రసంగించారు. పదవి చేపట్టినప్పటి నుండి ఏం చేశామో.. విడమర్చి చెప్పారు. ఏం చేయబోతున్నామో.. వివరింంచారు. పేద, మధ్యతరగతి ప్రజలకు భరోసా ఇచ్చేలా.. వారి అవసరాలకు అనుగుణంగానవరత్నాల పథకాలను రూపొందించామని… జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అలాగే.. అవినీతిని రూపుమాపేలా తీసుకొచ్చిన చట్టాల గురించి వివరించారు.
రివర్స్ టెండరింగ్ విధానాన్ని దేశంలోనే తొలి సారిగా ప్రవేశ పెడుతున్నామని గుర్తు చేశారు. గ్రామ సచివాలయాలతో గ్రామాల రూపురేఖలు మార్చబోతున్నామన్నారు. గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఈ రోజు నుంచే ప్రారంభిస్తామని… వచ్చేరెండు నెలల్లో మరో రెండు లక్షల అరవై ఆరు వేల ఉద్యోగిలిస్తామని ప్రకటించారు. అభివృద్ధి అంటే.. జీడీపీ ఒక్కటే కాదని.. జగన్ సూత్రీకరించారు. మానవ అభివృద్ధి సూచికను కూడా మెరుగు పరచాలని నిర్ణయించామన్నారు. గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుపడుతుందని నమ్ముతున్నానని ప్రకటించారు. భారతదేశ రాజకీయ చరిత్రను మలుపు తిప్పేలా సామాజిక న్యాయానికి చట్టాలు తీసుకొచ్చామన్నారు. బడుగు, బలహీన వర్గాల మహిళలకు పెద్దపీట వేశామని చేసిన చట్టాల గురించి గుర్తు చేశారు.
రైతుల కోసం.. ఏం చేయబోతున్నామో వివరించారు. అక్టోబర్ నుంచి రైతులకు రూ. 12500 ఇస్తామని ప్రకటించారు. వెయ్యి రూపాయలు ఖర్చు దాటిన వారికి ఉచిత వైద్యం, వంద శాతం ఫీజు రీఎంబర్స్ మెంట్ తో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. గోదావరి జలాలను సాగర్, శ్రీశైలానికి తరలించే ప్రాజెక్టు ను జగన్ ఘనంగా ప్రకటించారు. ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.