విజయవాడలో… కొన్నాళ్ల క్రితం… నగరం నడిబొడ్డున … రోడ్డుకు అడ్డంగా ఉందన్న కారణంగా.. ఓ భారీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ప్రభుత్వం తొలగించింది. అప్పట్లో చాలా వివాదం రేగింది. అప్పటికి వైసీపీలోనే ఉన్న వంగవీటి రాధాకృష్ణ.. అర్థరాత్రి రచ్చ చేశారు. మిగతా నేతలూ హడావుడి చేశారు. కానీ తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. వైఎస్ విగ్రహాన్ని తొలగించిన చోట.. ఇప్పుడు… మళ్లీ.. అదే వైఎస్ విగ్రహాన్ని పెట్టాలని.. జగన్ నిర్ణయించారు. ఆ మేరకు.. కార్యాచరణ కూడా ప్రారంభమయింది. ఇప్పుడిదే విజయవాడలో హాట్ టాపిక్.
వైఎస్ మరణం తర్వాత… 2011లో… అప్పట్లో ఎంపీగా ఉన్న లగడపాటి రాజగోపాల్ విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో.. నడి రోడ్డుపై .. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాజధానిగా మారిన తర్వాత ట్రాఫిక్ పెరిగిపోవడంతో.. విగ్రహం వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. కృష్ణా పుష్కరాలు కూడా రావడంతో.. ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు.. ఆ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. రోడ్డును వెడల్పు చేశారు. డివైడర్ల మధ్య… అవతార్ సినిమాకు సంబంధించిన ఆకృతులు నిర్మించారు. మొక్కలు పెంచి ఆహ్లాదంగా మార్చారు. దీంతో ఆ రోడ్డు కాస్త ఆకర్షణీయంగా మారింది. కానీ ఇప్పుడు.. ఆ అవతార్ విగ్రహాలను.. పూల మొక్కలను అధికారులు ధ్వంసం చేయించారు. తీసి వేయించారు.
వైఎస్ విగ్రహాన్ని తొలగించిన ప్రదేశంలోనే మళ్లీ వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వైసీపీ నేతలు నిర్ణయించారు. అయితే యథావిధిగా వైఎస్ విగ్రహాన్ని ఆ ప్రదేశంలో ఏర్పాటు చేస్తే రోడ్డును కుదించాల్సి ఉంటుంది. దాంతో సమస్యలు ఎదురవుతాయని భావించి … అవతార్ విగ్రహాలను తొలగించి ఆ ప్రదేశంలోనే వైఎస్ విగ్రహాన్ని నెలకొల్పాలని నిర్ణయించారు. అవతార్ విగ్రహాలను, వాటర్ ఫౌంటేన్, ఇతరత్రా వాటిని అధికారులు తొలగించారు. భారీ కార్యక్రమంతో వైఎస్ విగ్రహాన్ని పెట్టడమే మిగిలింది.