చంద్రబాబు ఇంటిపై.. డ్రోన్లతో నిఘా పెట్టి.. దృశ్యాలు చిత్రీకరిస్తున్న ఇద్దరు వ్యక్తులను .. భద్రతా సిబ్బంది పట్టుకోవడం.. కలకలం రేపుతోంది. ఉదయమే.. చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. అన్ని కోణాల్లోనూ… డ్రోన్ కెమెరాతో దృశ్యాలు చిత్రీకరించడం ప్రారంభించారు. ఇంటిపై డ్రోన్లు ఎగురుతూండటంతో.. చంద్రబాబు ఇంటి భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. దాన్ని ఆపరేట్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. విషయం తెలుసుని.. వెంటనే టీడీపీ నేతలు.. చంద్రబాబు ఇంటి వద్దకు చేరుకున్నారు. వారిద్దరి నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. ఈ లోపే పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకుని.. అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. కానీ.. టీడీపీ నేతలు అంగీకరించలేదు. అసలు.. వారి వివరాలు.. డ్రోన్ తో దృశ్యాలు చిత్రీకరించాలని ఎవరు చెప్పారు.. ఎందుకు చిత్రీకరిస్తున్నారో చెప్పాలని.. టీడీపీ నేతలు.. పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు.
ఈ క్రమంలో దృశ్యాలు చిత్రీకరిస్తున్న వారి నుంచి జగన్ ఇంట్లో నుంచి తమకు ఆదేశాలు వచ్చాయనే మాటలు వచ్చాయి. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన.. డ్రోన్ కెమెరాను ఆపరేట్ చేస్తున్న వ్యక్తులు.. తమను.. జగన్ ఇంట్లో పని చేస్తున్న కిరణ్ అనే వ్యక్తి.. తమను పంపారని చెబుతున్నారు. ఆయన చెప్పారన్న కారణంగానే… తాము.. దృశ్యాలు చిత్రీకరించామని చెప్పుకొచ్చారు. అయితే.. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు.. వారిద్దరూ.. పొంతన లేని సమాధానాలు చెప్పారు. వారికి ఎలాంటి పర్మిషన్ లెటర్ కానీ.. కనీసం .. వారి వద్ద గుర్తింపు కార్డులు కానీ లేవు. దీంతో.. ఏదో కుట్ర జరిగిందనే అనుమానాలను టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
కొన్నాళ్ల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతను.. ఏపీ సర్కార్ తగ్గిస్తూ వస్తోంది. ఈ కారణంగా.. టీడీపీ నేతల్లో అనేక అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పుడు.. చంద్రబాబు ఇంటిని అన్ని కోణాల్లోనూ… చిత్రీకరించాల్సిన అవసరం ఏమిటన్న అనుమానం టీడీపీ నేతల్లో ఏర్పడింది. చంద్రబాబుకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. ఆయన నివాసం విషయంలో.. భద్రతాపరమైన ఆంక్షలు ఉంటాయి. ఆయన నివాసం చుట్టూ… టైట్ సెక్యూరిటీ ఉంటుంది. డ్రోన్లు ఎగరడానికి అసలు పర్మిషన్ ఇవ్వరు. ఒకవేళ ఇవ్వాలి ఇంటే.. డీజీపీ స్థాయిలో పర్మిషన్ కావాలని అంటున్నారు. మరి.. ఎలాంటి పర్మిషన్లు లేకుండా.. ఇద్దరు అపరిచిత వ్యక్తులు.. చంద్రబాబు నివాసంపై .. డ్రోన్లతో హంగామా చేయడం.. కలకలం రేపుతోంది.
ఈ ఘటనపై.. ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేరుగా డీజీపీకి ఫోన్ చేసి.. తన భద్రతను ఎందుకు ప్రశ్నార్థకం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఓ వైపు చంద్రబాబు ఇంటిని ముంచడానికి.. వరదను నియంత్రిస్తూ.. మరో వైపు.. ఈ తరహా కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారం ఇంతటితో ఆగే సూచనలు కనిపించడం లేదు. తీవ్ర స్థాయిలో ఆందోళనలకు టీడీపీ నేలు సిద్ధమవుతున్నారు.