అటు విమర్శకుల ప్రసంశల్నీ, ఇటు భారీ వసూళ్లనీ అందుకుని 2018 బిగ్గెస్ట్ హిట్స్లలో ఒకటిగా నిలిచింది రంగస్థలం. ఇప్పుడు అవార్డుల పరంపరకూ శ్రీకారం చుట్టింది. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డులలో సౌండ్ మిక్సింగ్ విభాగంలో పురస్కారం అందుకుంది. ఇప్పుడు `సైమా`లో తన తడాఖా చూపించింది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ప్రస్తుతం కత్తర్లో జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో సింహభాగం అవార్డులు రంగస్థలం కైవసం చేసుకుంది. ఉత్తమ నటుడిగా రామ్చరణ్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడుగా సుకుమార్ పురస్కారం అందుకున్నారు. ఉత్తమ సహాయ నటిగా అనసూయ అవార్డు కైవసం చేసుకుంది. ఉత్తమ సంగీతం (దేవిశ్రీ), ఉత్తమ గీత రచయిత (చంద్రబోస్) అవార్డులు కూడా రంగస్థలంవే. సమంతకు జ్యూరీ అవార్డు దక్కింది. ఉత్తమ సినిమాటోగ్రాఫర్, ఉత్తమ కళా దర్శకత్వం, ఉత్తమ నేపథ్య గాయని అవార్డులు కూడా రంగస్థలంకే దక్కాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి అవార్డులు మాత్రం `మహానటి` ఖాతాలో చేరాయి.