ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు ఇంటి ప్రాంతంలో డ్రోన్ కెమెరాల కలకలం తెలిసిందే. ఆ కెమెరాలను పట్టుకుని వచ్చినవారి దగ్గర కనీసం గుర్తింపులు కార్డులుగానీ, అనుమతి లేఖ కూడా లేదని టీడీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు నాయుడుకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది కాబట్టి, అనుమతి లేకుండా ఇలాంటివి చేయకూడదని చెబుతున్నారు. అయితే, ఈ డ్రోన్ కెమెరాలపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఆయన ఒక్క ఇంటినే తీయాలంటూ డ్రోన్లను పంపించలేదనీ, వరద పోటు నేపథ్యంలో పరిస్థితిని తెలుసుకోవడం కోసం విజువల్స్ తీయమని ఒక ఏజెన్సీకి చెప్పామన్నారు. భవానీ ఐలండ్ తో సహా ఎడమ, కుడి ప్రాంతాలను మొత్తం కవర్ చేయమన్నామన్నారు. దాన్లో చంద్రబాబు నాయుడు ఇల్లుందనీ, అంతేగానీ ఆయన ఇంటిపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి విజువల్స్ తీయాల్సిన అవసరం ఏముంటుందని మంత్రి అన్నారు.
ఒకవేళ రేప్పొద్దున ఆయన ఇల్లు పూర్తిగా మునిగిందే అనుకుందాం… అప్పుడేమంటారూ, ప్రతిపక్ష నాయకుడి ఇల్లు వరదలో మునిగిపోతున్నా వైకాపా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాళ్లే విమర్శలు చేస్తారన్నారు. అక్కడికి నీళ్లు రాకపోతే ఇసుక బస్తాలు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. అంటే, మీరు ప్రమాద ప్రాంతంలో నివాసం ఉంటున్నట్టే కదా, తాము మొదట్నుంచీ చెబుతున్నది నిజమనే కదా అర్థం అన్నారు. మీ ఇంటి ముందు నీరుంటే… దాన్ని బయటకి చూపించకూడదని ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు అనిల్ కుమార్. కరకట్ట మీదికి నీళ్లొచ్చాయని ప్రజలకు తెలిసిపోతుందని భయపడుతున్నారా అన్నారు.
ఆయన అధికారంలో ఉండగా ఏరోజూ వరద వచ్చిందీ లేదనీ, వర్షాలే సరిగా పడింది లేదనీ, ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా అంతే పరిస్థితి అని ఎద్దేవా చేశారు. ఇవాళ్ల రాష్ట్రంలో రైతులు హాయిగా ఉన్నారనీ, పుష్కలంగా నీరు వస్తోందనీ, దాంతో తమకు మంచి పేరు రైతాంగంలో వచ్చేస్తుందన్న కుళ్లుతో అలా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు. ఒకవేళ, ఇలాంటి నీరు చంద్రబాబు హయాంలో వచ్చి ఉంటే… ఆయన ఈపాటికే కోట్లు ఖర్చుపెట్టి హారతులు ఇచ్చేసి ప్రచారం చేసుకునేవారన్నారు. అలాంటి రాజకీయాలు తమకు చేతగావని మంత్రి అనిల్ అన్నారు. మొత్తానికి, అవి ప్రభుత్వం పంపిన కెమెరాలే అని మంత్రి చెప్పారు. అయితే, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న ప్రాంతంలోకి అవి వెళ్లాయి కదా అంటే… దాని వల్ల ఆయన భద్రతకు ఏదైనా ముప్పు వచ్చిందా అనే సమాధానంతో మంత్రి సరిపెట్టేశారు.!