తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు నిలిపేస్తామంటూ ప్రైవేటు ఆసుపత్రులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. తమకు బాకీ పడ్డ సొమ్మును చెల్లించాలంటూ ఆసుపత్రుల సంఘం గడువు పెట్టినా, దాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని వారు అంటున్నారు. అయితే, చివరి నిమిషంలో రంగంలోకి దిగారు మంత్రి ఈటెల రాజేందర్. రూ. 1500 కోట్ల బకాయిల్ని చెల్లించాలని హాస్పిటల్ యాజమాన్యాలు అంటుంటే, కాదు కాదు బకాయిపడ్డది రూ. 450 కోట్లు మాత్రమే అని మంత్రి ఈటెల మీడియాకి చెప్పారు. అయితే, వాటిని కూడా ఒకేసారి చెల్లించలేమనీ, దశలవారీగా నిధులు విడుదల చేస్తామని మంత్రి అన్నారు. బకాయిల పేరుతో చికిత్సలు, అత్యవసర సేవల్ని వైద్యులు నిలిపేయడం సరికాదన్నారు.
అదేంటీ.. తెలంగాణ ధనిక రాష్ట్రం కదా! ఈటెల లెక్కల ప్రకారమే రూ. 450 కోట్లను సర్దుబాటు చెయ్యలేకపోయారా..? ఆరోగ్య శ్రీ లాంటి పథకానికి కూడా బడ్జెట్ లో కేటాయింపులు చెయ్యలేకపోయారా..? అయినా, ఎన్నోయేళ్లుగా అమలౌతున్న పథకానికి నిధుల విడుదల అనేది సాధారణ పరిపాలన వ్యవహారంగా మారిపోవాలి కదా…? ఇంతకీ నిధులు ఎందుకు విడుదల చేయలేకపోయారన్నదానికి కూడా మంత్రి ఈటెల మరో కారణం చెప్పారు! అదేంటంటే… ఎన్నికల కోడ్ వల్ల నిధుల కేటాయింపులు ఆలస్యమైందన్నారు. రాష్ట్రంలో వరుస ఎన్నికల కోడ్ అమల్లో ఉంటూ వచ్చిందనీ, అందుకే ప్రభుత్వం బడ్జెట్ కేటాయించలేకపోయిందన్నారు. నిజానికి, ఆరోగ్యశ్రీ నిధులకీ ఎన్నికల కోడ్ కి సంబంధం ఉంటుందా… కచ్చితంగా ఉండదనే చెప్పాలి.
ఆరోగ్యశ్రీ పథకం కొత్తదేం కాదు, ఉమ్మడి రాష్ట్రం ఉండగానే వైయస్సార్ హయాంలో ప్రారంభమై కొనసాగుతూ ఉంది. గత ప్రభుత్వాల నుంచి అమ్మల్లో ఉన్న ఇలాంటి సంక్షేమ పథకాల నిధుల విషయమై ఎన్నికల సంఘం ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం చెయ్యదు. ఇక, బడ్జెట్ విషయానికొస్తే… ఈ పథకానికి ఎప్పటికప్పుడు నిధులను కేటాయించుకునే కదా ఇన్నాళ్లూ అమలు చేసింది! ఆ లెక్కన ఇప్పుడు కూడా ఆరోగ్యశ్రీకి నిధుల విడుదల సక్రమంగానే ఉండాలి. అలా విడుదల చేయకపోవడం తెరాస సర్కారు అలసత్వం. అంతేకాదు, సేవలు నిలిపేస్తామని ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించే చివరి నిమిషం వరకూ ప్రభుత్వం స్పందించకపోవడం కూడా బాధ్యతా రాహిత్యంగానే కనబడుతోంది. ఎన్నికల కోడ్ ఉందనీ, నిధులు విడుదల ఆలస్యమైందనేది మంత్రి ఈటెల చెప్పడం తప్పుని వేరేవాళ్లపై నెట్టేయడం అన్నట్టుగా ఉందనే అభిప్రాయం కలుగుతోంది.