రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రజల్లో పరిపాలన వ్యవహారాలతో రాజధానికి మాత్రమే ఎక్కువగా పరిమితమౌతూ వచ్చారు సీఎం కేసీఆర్. ప్రాజెక్టుల పనుల పరిశీలన తప్ప… ప్రత్యేకంగా ప్రజా సమస్యల పేరుతో జిల్లాల్లో ఇంతవరకూ పర్యటించింది లేదు. సమస్యలేవైనా ఉంటే… సంబంధిత శాఖల మంత్రుల ద్వారా తెలుసుకోవడం, అవసరమైన చర్యలకు ఆదేశాలు ఇవ్వడం మాత్రమే చేశారు. అయితే, ఇప్పుడు జిల్లాలవారీగా పర్యటించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమౌతున్నట్టు సమాచారం.
ఇంతకీ ప్రధాన అజెండా ఏంటంటే… ఇప్పటికే చేపట్టిన ప్రధానమైన ప్రాజెక్టులు పూర్తయ్యాయి కాబట్టి, వాటి గురించి ప్రజలకు వివరించాలని భావిస్తున్నారట! దీంతోపాటు, ప్రతీ జిల్లాకు నీరు వచ్చే విధంగా చేయాలనే లక్ష్యాన్ని కూడా ప్రజలకు చెబుతారని సమాచారం. కొత్త ప్రాజెక్టులను ఎక్కడెక్కడ నిర్మించబోతున్నామనేది కూడా ప్రకటించాలని భావిస్తున్నారట. నిజానికి, ఓ మూడు రోజుల కిందట వరంగల్ జిల్లాకి చెందిన సమీక్ష కార్యక్రమం జరిగింది. దాన్లో ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల గురించే ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రతీ జిల్లాలోనూ కేవలం నీటి సమస్య అంశమే ప్రముఖంగా చర్చించాలని సీఎం అభిప్రాయపడ్డట్టు సమాచారం. ప్రతీ జిల్లాకీ సాగునీరు ఎలా అందించాలనేది ఒక ప్రణాళికను ఆయన ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్టు అధికారులు అంటున్నారు. ప్రతీ శాసనసభ నియోజక వర్గానికి సాగునీరు ఏవిధంగా వస్తుందనే స్పష్టమైన ప్లాన్ ఆయన దగ్గర ఉందంటున్నారు. దీంతోపాటు, ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు గురించి కూడా ముఖ్యమంత్రి ప్రజలకు వివరిస్తారని అంటున్నారు. త్వరలో జిల్లాల పర్యటన షెడ్యూల్ కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది.
ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల గురించి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ప్రతీ శాసన సభ నియోజక వర్గానికీ నీరు తెస్తామనే ప్రణాళికను ప్రజల ముందు పెడితే, అందరి అటెన్షన్ ఒక్కసారిగా కేసీఆర్ మీదికి మళ్లుతుంది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు మాత్రమే ఉన్నాయి! ఉన్నట్టుండి జిల్లాల పర్యటనలూ కొత్త హామీలూ అంటే… ఆ ఎన్నికల లక్ష్యమా అనే అభిప్రాయం కలుగుతోంది. ప్రజా సమస్యలపై కూడా సీఎం ప్రజలతో ముఖాముఖీ నిర్వహించాలని కూడా భావిస్తున్నారని సమాచారం.