హైదరాబాద్: సెల్ఫీలమోజు వెర్రి తలలు వేయటం, సెల్ఫీలు తీసుకునే క్రమంలో పలువురు ప్రాణాలు పోగొట్టుకోవటంపై మీడియాలో అనేక వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో ఒక యువకుడు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్(నార్త్‌లో జిల్లా కలెక్టర్లను డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అని పిలుస్తారు)తో సెల్ఫీకి ప్రయత్నించి కటకటాలపాలయ్యాడు. దీని పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. బులంద్‌షహర్ జిల్లా కలెక్టర్ చంద్రకళ మొన్న సోమవారం జిల్లాలోని కమలాపూర్ అనే గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ సభలో స్థానిక సమస్యలపై మాట్లాడుతుండగా ఫరద్ అహ్మద్ అనే యువకుడు కలెక్టర్ వద్దకు వెళ్ళి సెల్ఫీలు తీసుకోవటానికి ప్రయత్నించాడు. తన అనుమతి లేకుండా ఇలా చేయకూడదని, వైదొలగమని కలెక్టర్ వారిస్తున్నప్పటికీ వినకుండా పర్ఫెక్ట్ సెల్ఫీ తీసుకోవానికి ప్రయత్నించసాగాడు. దీనితో ఆమె పోలీసులను అప్రమత్తం చేయటంతో వారు ఫరద్ను అరెస్ట్ చేశారు. కోర్టుముందు హాజరు పరచగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. నిన్న అతను బెయిల్ మీద హాజరయ్యాడు. తన అనుమతి తీసుకోకుండా అతను వరసగా ఫోటోలు తీసుకోసాగాడని, తాను చెప్పినా వినిపించుకోవటంలేదని, అందుకే పోలీసులకు చెప్పానని కలెక్టర్ చంద్రకళ మీడియాకు తెలిపారు. 2008 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన చంద్రకళ, 2014లో రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించనందుకు మున్సిపల్ సిబ్బందిపై, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని సంచలనం సృష్టించారు.