2020 సంక్రాంతి బెర్తులు ఒకొక్కటిగా ఫిల్ అవుతున్నాయి. మహేష్ బాబు `సరిలేరు నీకెవ్వరు` సంక్రాంతికే విడుదల అవుతోంది. మరోవైపు అల్లు అర్జున్ `అల వైకుంఠపురములో` కూడా పండక్కే వస్తోంది. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోల మధ్య నందమూరి కల్యాణ్ కూడా తన సినిమాకి రంగంలోకి దించడానికి రెడీ అయ్యాడు. కల్యాణ్ రామ్ కొత్త సినిమా `ఎంత మంచి వాడవురా` ఈ సంక్రాంతికే విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకుడు. జులైలో చిత్రీకరణ మొదలై తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఈనెల 27 నుంచి రెండో షెడ్యూల్‌కి శ్రీకారం చుట్టబోతున్నారు. కుటుంబ బంధాల నేపథ్యంలో సాగే ఫీల్ గుడ్ సినిమా ఇది. సంక్రాంతి పండక్కి కుటుంబ కథా చిత్రాలకు మంచి గిరాకీ ఉంటుంది. పైగా సతీష్ వేగేశ్న `శతమానం భవతి` కూడా భారీ పోటీ మధ్య పండక్కి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అదే సెంటిమెంట్‌తో ఈ సినిమానీ సంక్రాంతికే విడుదల చేస్తున్నారు. మరి ఈ పోటీని ఈ మంచోడు ఎంత వరకూ తట్టుకుంటాడో చూడాలి.