చంద్రబాబు ఇంటిపై డ్రోన్ ఎగురవేయడాన్ని తెలుగుదేశం పార్టీ … కోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. వైసీపీ అధినేత ట్రాక్ రికార్డు ప్రకారం.. ఇలాంటి విషయాల్ని తేలికగా తీసుకుంటే… చంద్రబాబు భద్రతకు తీవ్రమైన ప్రమాదం పొంచి ఉంటుందని అనుమానిస్తున్నారు. అందుకే.. గవర్నర్ కు ఫిర్యాదు చేసిన తర్వాత.. కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. ఈ కేసులో ముఖ్యమంత్రి జగన్ పేరును కూడా చేర్చాలని… టీడీపీ నేతలు నిర్ణయించారు. డ్రోన్ లతో దృశ్యాలు చిత్రీకరిస్తూ దొరికిపోయిన ఇద్దరు వ్యక్తులు.. జగన్ ఇంట్లో పని చేసే.. కిరణ్ అనే వ్యక్తి చెప్పడం వల్లే తాము ఈ దృశ్యాలు చిత్రీకరిస్తున్నామని వాంగ్మూలం ఇచ్చారు. అదే టీడీపీ నేతలకు.. అస్త్రంగా మారింది. దీని ఆధారంగా… కోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు.
జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై…డ్రోన్లు ఎగురువేయడం.. దృశ్యాలు చిత్రీకరించడం.. కచ్చితంగా నేరమే. పైగా ఎలాంటి అనుమతులు లేవు. అయినప్పటికీ.. పోలీసులు ఎలాంటి కేసూ నమోదు చేయలేదు. స్వయంగా.. డీజీపీ కూడా..పోలీసులు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ అంశాలన్నింటినీ… కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. అదే సమయంలో.. ఈ వ్యవహారం.. అంతకంతకూ పెద్దదవుతూండటంతో.. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. డీజీపీ గౌతం సవాంగ్ మరోసారి.. ఈ అంశంపై స్పందించి… రాజకీయం చేయవద్దని ప్రతిపక్షపార్టీకి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు ఇంటి వద్ద వరద దృశ్యాలను చిత్రీకరించాలని జలవనరుల శాఖ ఆదేశించిందని… అయితే.. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల స్థానిక పోలీసులకు తెలియలేదని.. కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.
ఇక నుంచి ఎవరు డ్రోన్లు ఆపరేట్ చేయాలన్నా.. పర్మిషన్ తీసుకోవాలంటూ.. చెప్పుకొచ్చారు. ఇక ముందు సంగతేమో కానీ… ఇప్పటి వరకూ.. మామూలుగానే.. డ్రోన్లు ఎగురవేయాలంటే.. పర్మిషన్లు తీసుకోవాలి. అదీ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నేత ఇంటి మీద ఎగురవేయాలంటే… దానికి సంబంధించి స్పష్టమైన ఉత్తర్వులు ఉండాలి. కానీ అవేమీ లేకుండా… ఇద్దరు వ్యక్తుల చేసిన పనిని కప్పి పుచ్చేందుకు పోలీసులు కూడా తంటాలు పడుతున్నారు. వారిపై ఇప్పటి వరకూ కేసులు నమోదు చేయలేదు. ఈ అంశాన్ని టీడీపీ నేతలకు బలమైనవాదనకు అవకాశం కల్పిస్తున్నాయి. అందుకే వారు కోర్టులో ప్రైవేటు కేసు దిశగా నిర్ణయం తీసుకున్నారు.