వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శల ట్వీట్ల జోరును కొనసాగిస్తున్నారు. వరద నేపథ్యంలో ఆయన స్పందిస్తూ… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో వరద వస్తే… చంద్రబాబు వన్ మేన్ షో నడిచేదనీ, కలెక్టర్లపై ఆగ్రహం, ఆయన వచ్చే వరకూ ముందుకు సాగని అధికారులంటూ కథనాలు వచ్చేవన్నారు. ఇప్పుడలాంటి పరిస్థితి లేదనీ, అధికారులూ మంత్రులూ అందరూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని విజయసాయి రెడ్డి చెప్పారు. వరద నీటిలో మునిగిన ప్రతిపక్ష నాయకుడి ఇంటిని డ్రోన్ తో చిత్రించడం కుట్ర ఎలా అవుతుందన్నారు. వరద వస్తుందని తెలియగానే, గేట్లు తెరవగానే పరువు పోతుందని గ్రహించిన చంద్రబాబు హైదరాబాద్ కి పారిపోయారని ఎద్దేవా చేశారు.
కృష్ణా నది ప్రవాహం కూడా ఆ నదే కావాలనే తానే పెంచేసుకుంటోందని చంద్రబాబు విమర్శించినా ఆశ్చర్య పోనక్కర్లేదన్నారు. దీంతోపాటు, చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ ఫొటోలతో కొన్ని వ్యంగ్య కామెంట్స్ ఉన్న పోస్టు కూడా పెట్టారు. మరో ట్వీట్లో… ఎల్లో మీడియాకి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడిందనీ, రివర్స్ గేర్ వెయ్యాల్సి వచ్చిందని విజయసాయి అభిప్రాయపడ్డారు. భాజపాకి చంద్రబాబు నాయుడు దూరమైన దగ్గర్నుంచీ ఆ మీడియా ఆయన్ని విలన్ గా చిత్రీకరిస్తోందన్నారు. ఇప్పుడు పచ్చ పార్టీ నాయకులంతా బీజేపీలోకి చేరిపోతున్నారన్నారు.
నిజానికి, వరద సహాయక చర్యలపై చాలా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. విజయసాయి చెప్పింతగా నూటికి నూరు శాతం సహాయ చర్యలు జరుగుతున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. ఇక, లంక గ్రామాలు పరిస్థితి చెప్పాల్సిన పనేలేదు. ఒకవేళ అధికారులూ మంత్రులూ విజయసాయి చెప్పినట్టే సక్రమంగా పనిచేసి ఉంటే… వారం ముందే వరద సమాచారం ఉన్నా కూడా ఎందుకు ముందు జాగ్రత్త చర్యల్ని ముమ్మరం చేయలేకపోయారు? గుంటూరు జిల్లాలో కొన్ని గ్రామాల్లో వైకాపా నేతలు పర్యటిస్తున్న సమయంలో.. ఓ ఎమ్మెల్యే అక్కడి ప్రజలను కిన్లే వాటర్ బాటిల్ ఉందా అని అడిగారు! దాంతో, తాగడానికి మంచినీరు లేక మురుగునీటిలో మగ్గుతుంటే.. మినరల్ వాటర్ అడుగుతారా అంటూ ప్రజలు నిలదీసిన పరిస్థితి ఉంది. నీటి వలయంలో గ్రామాలు చిక్కుకుని ఉన్న ఈ సందర్భంలో కూడా… వరద అంశాన్ని నేపథ్యంగా చేసుకుని చంద్రబాబు నాయుడుపై ఇప్పుడు విమర్శలు అవసరమా..? సహాయక చర్యలు పూర్తయ్యాక తీరిగ్గా ఎన్ని పోస్టులైనా పెట్టుకోవచ్చుగా?