పోలవరం రివర్స్ టెండర్లపై… ఏపీ సర్కార్ వైఖరి కేంద్రాన్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. హైదరాబాద్ లో జరిగిన పీపీఏ సమావేశంలో..రివర్స్ టెండరింగ్ కు వెళ్లేందుకు ఎలాంటి అనుమతి ఇవ్వకపోయినా… ఇచ్చినట్లుగా ప్రచారం చేసేసుకుని.. టెండర్లను ఆహ్వానించడంపై కేంద్రం గుర్రుగా ఉంది. అసలేం జరిగిందో వివరణ ఇవ్వాలని పోలవరం ప్రాజెక్ట్ అధారిటీని కేంద్రం ఆదేశించింది.
రివర్స్ టెండర్లతో కేంద్రం ఈగోని దెబ్బకొట్టిన జగన్..!
పోలవరం పనులకు రివర్స్ టెండర్ నోటిఫికేషన్‌ను ఏపీ సర్కార్ జారీ చేసింది. వెంటనే… కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ .. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ సీఈవో ఆర్కే జైన్‌కు ఫోన్.. పోలవరం పరిస్థితిపై.., పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆర్కే జైన్ పోలవరం ప్రాజెక్ట్ ను.. క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక తయారు చేసి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. టెండరింగ్లను పీపీఏ తీవ్రంగా వ్యతిరేకించింది. పీపీఏ సమావేశంలో ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వం జలవనరుల శాఖాధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయినా ఏపీ సర్కార్.. తమకు అనుమతులు లభించాయని.. తమకు తాము అనుకుని రివర్స్ టెండరింగ్ కు వెళ్లిపోయారు.
ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్న పీపీఏ, జీవీఎల్ …!
సవివర నివేదిక ఇచ్చేందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈవో ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారుల బృందం మంగళవారం పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతాన్ని పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. క్షేత్రస్థాయి పర్యటనకు వస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారాన్ని పీపీఏ పంపింది. దీంతో ఏపీ జలవనరుల శాఖ అధికారులు సందిగ్ధంలో పడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ మాత్రమే కాదు.. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా మంగళవారమే పోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలించనున్నారు. కేంద్రం.. పోలవరం ప్రాజెక్ట్ పై ఓ నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతోనే… అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు పార్టీ పరంగా…నివేదికలు తీసుకుంటోందని చెబుతున్నారు. కొద్ది రోజుల్లోనే పోలవరంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఏపీ సర్కార్ ధిక్కారానికి సరైన ట్రీట్మెంట్ ఉంటుందా..?
కేంద్రం ప్రభుత్వ పెద్ద ఈగో మీద జగన్మోహన్ రెడ్డి దెబ్బకొట్టారన్న ప్రచారం జరుగుతోంది. కేంద్ర పెద్దలు ఎన్ని సార్లు లేఖలు రాసినా.. ఎంత నచ్చ చెప్పినా.. ఏపీ సర్కార్ వినిపించుకోవడం లేదు. ఈ ఒక్క అంశం మాత్రమే.. కాదు.. అన్ని విషయాల్లోనూ అదే పరిస్థితి. అందుకే.. గట్టి షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వాలన్న ఆలోచనలో కేంద్రం పెద్దలు ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం.., పోలవరం ప్రాజెక్ట్ జాతీయ హోదాను రద్దు చేయడం లేదా… ఇతర అంశాల్లో… ఏపీ సర్కార్ కు షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయంటున్నారు. తమకు అధికారం ఉందని వాదిస్తున్న ఏపీ సర్కార్ కు.. అధికార పరిధులేమిటో.. వివరాలనుకుంటున్నట్లుగా కేంద్రం ఉందంటున్నారు.