పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. స్పిల్ వే, హైడల్ విద్యుత్ ప్రాజెక్ట్ కాంట్రాక్టులను రద్దు చేస్తూ.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై… నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ హైకోర్టుకు ఎక్కింది. అసలు తామేం తప్పు చేశామో.. కనీసం చెప్పకుండా.. టెర్మినేషన్ నోటీసులు ఇచ్చి… తమ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించారని.. పిటిషన్లో నవయుగ సంస్థ ఆరోపించింది.
న్యాయవివాదాల్లోకి పోలవరం ప్రాజెక్ట్..!
పనులు వేగంగా చేస్తున్న సంస్థని పక్కన పెట్టి.. రివర్స్ టెండరింగ్‌కి వెళ్లడాన్ని వ్యతిరేకిస్తూ.. పోలవరం పనులు తమనే కొనసాగించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్లో పేర్కొంది. రివర్స్ టెండరింగ్ ప్రక్రియను నిలిపివేయాలని కోరింది. అసలు కాంట్రాక్ట్ రద్దు చేసే అధికారం… ఏపీ సర్కార్‌కు లేదనేది.. నవయుగ సంస్థ వాదన. ఏపీ సర్కార్.. ధర్డ్ పార్టీ మాత్రమేనని.. ఏదైనా.. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీనే నిర్ణయం తీసుకోవాలని.. నవయుగ సంస్థ వాదిస్తోంది. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాలన్నట్లుగా.. నవయుగ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో.. పోలవరం ప్రాజెక్ట్ న్యాయవివాదాల్లో చిక్కుకోవడం ఖాయంగా కనిపనిస్తోంది.
తప్పించడానికి ఒక్క కారణమూ చెప్పలేదన్న నవయుగ..!
నిజానికి నవయుగ సంస్థపై ఎలాంటి ఫిర్యాదులు లేవు. ఏపీ సర్కార్ కూడా.. అవినీతి జరిగిందని చెప్పలేకపోతోంది. మంత్రులు కూడా… అవినీతి గురించి మాట్లాడటం లేదు. .. కానీ.. పద్దతి ప్రకారం.. కాంట్రాక్ట్ ఇవ్వలేదని వాదిస్తున్నారు. ట్రాన్స్ట్రాయ్ సంస్థ చేతులెత్తేసిన తర్వాత కేంద్ర మంత్రి గడ్కరీ ప్రత్యేక చొరవతో… పాత రేట్లకే.. నవయుగ కంపెనీ పనులు చేపట్టింది. అయితే.. ఇలా నిబంధనలకు విరుద్ధంగా పనులు అప్పగించాంటూ.. జగన్మోహన్ రెడ్డి బంధువు, మాజీ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్ నేతృత్వంలో ఓ నిపుణుల కమిటీని నియమించారు. ఆ నిపుణల కమిటీ.. ప్రభుత్వానికి ఎలా కావాలో.. అలా నివేదిక ఇచ్చింది. దాన్నే.. అన్ని చోట్లా చూపిస్తున్న ఏపీ సర్కార్.. కాంట్రాక్టులను రద్దు చేసింది. కానీ ఇప్పుడు.. ఆ కమిటీ నివేదిక కోర్టులో నిలబడదు. ఎందుకంటే.. ఆ కమిటీకి ఎలాంటి చట్టబద్ధత లేదు. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు ఇచ్చారన్నదానికీ ప్రాతిపదిక లేదని… పీపీఏ అధికారులు.. మొదటి నుంచి చెబుతున్నారు.
నవయుగకు ఇచ్చిన మాటను సర్కార్ తప్పిందా..?
నిజానికి నవయుగ సంస్థ కూడా.. పోలవరం ప్రాజెక్ట్ నుంచి వైదొలిగేందుకు సిద్ధమయింది. తమ లెక్కలు సెటిల్ చేస్తే.. వెళ్లిపోవడానికి సిద్ధమని చెప్పింది. ప్రభుత్వం ఈ మేరకు.. నవయుగ సంస్థతో మ్యూచువల్ అండర్ స్టాండింగ్ కు వచ్చింది. అయితే… నవయుగకు ఇచ్చిన మాట ప్రకారం… లెక్కలు సెటిల్ చేయకుండానే.. రివర్స్ టెండర్లకు ఏపీ సర్కార్ వెళ్లిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలి బాగా తెలిసిన నవయుగ యాజమాన్యం.. తేడా గుర్తించడంతో.. వెంటనే .. కోర్టుకు వెళ్లినట్లు చెబుతున్నారు. కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ ఏర్పడింది.