ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మార్చే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందని.. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేరుగా ప్రకటించారు. వరదల కారణంగా.. రాజధాని ప్రాంతంలో ముంపు ఉంటుందని తేలిందని… స్పష్టం చేశారు. అందువల్లే రాజధాని విషయంలో… ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. బొత్స చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలించబోతున్నారనే ఈ చర్చ.. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి జరుగుతోంది. అమరావతిలో ఎక్కడి పనులు అక్కడ ప్రభుత్వం నిలిపివేయడమే కాకుండా… భవిష్యత్ కు సంబంధించి ప్లాన్లను మొత్తం స్క్రాప్ చేసేసింది. ఇప్పుడు… ఆ ప్రాంతం రాజధానికి పనికి రాదని.. చెప్పడానికి ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా వరద వస్తే మునిగిపోతుందని కొంతకాలంగా… వైసీపీ వైపు నుంచి ప్రచారం జరుగుతోంది. తాజాగా వచ్చిన వరదలతో దాన్ని నిరూపించే ప్రయత్నం చేశారని… నీళ్లన్నింటినీ బిగపట్టి ఒక్కసారిగా వదిలి.. రాజధాని గ్రామాల్లోకి నీరు వచ్చేలా చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. అయితే..లంక గ్రామాలు మునిగాయి కానీ.. ఒక్క రాజధాని గ్రామంలోకి నీరు రాలేదు. కానీ.. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం…తాజా వరదల కారణంగా అమరావతిలో ముంపు ప్రాంతాలు ఉన్నాయని తెలిసిందని ప్రకటించారు. ముంపు భయం నుంచి బయటపడాలంటే… కాల్వలు, డ్యామ్లు నిర్మించాల్సి ఉన్నందున.. నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందన్నారు.
వరదనీటిని తోడి బయటకు పంపించాల్సి ఉంటుందని…అందుకే ఖర్చు పెరుగి.. ప్రజాధనం వృధా అవుతుందన్నారు. ఈ కారణంగా..అమరావతిలో రాజధాని ఉంచాలా.. వద్దా అని ఆలోచిస్తున్నట్లుగా.. బొత్స చెప్పుకొచ్చారు. రాజధాని అమరావతిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. బొత్స చెప్పిన దాని ప్రకారం చూస్తే రాజధాని తరలింపు విషయంలో..సరైన సమయం కోసం… ఏపీ సర్కార్ ఎదురు చూస్తున్నట్లుగా భావించవచ్చు. అక్కడ రాజధాని మంచిది కాదనే ముద్ర బలంగా వేసిన వెంటనే… మిగతా లాంఛనాన్ని ప్రభుత్వం పూర్తి చేయవచ్చని చెబుతున్నారు.