తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు పునః ప్రారంభం కానున్నాయి. గతవారం రోజులుగా ఆరోగ్య శ్రీ సేవల్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు నిలిపేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓసారి వారితో తెలంగాణ ప్రభుత్వం చర్చించింది, కానీ చర్చలు విఫలమయ్యాయి. అయితే, ఇప్పుడు మరోసారి చర్చలకు నిర్వహించారు మంత్రి ఈటెల రాజేందర్. ప్రైవేటు ఆసుపత్రుల డిమాండ్లపై మంత్రి ఈటెల సానుకూలంగా స్పందించారు. దీంతో ఆరోగ్య శ్రీ వైద్యసేవలు యథాతథంగా ప్రారంభం అయ్యాయి. ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఈటెల మీడియాతో మాట్లాడుతూ… ఆరోగ్య శ్రీని గొప్పగా నిర్వహిస్తామన్నారు! తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దేశ చిత్రపటంలో నిలబెడతామన్నారు! తెలంగాణ ఆరోగ్య శ్రీ పథకం దేశానికే ఒక ఆదర్శంగా ఉంటుందనడంలో సందేహం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కంటే కొన్ని వందల రెట్లు మెరుగైందన్నారు. కేంద్ర పథకం ద్వారా కేవలం 26 లక్షల మందికి మాత్రమే వైద్య సేవలు అందుతాయనీ, కానీ తెలంగాణ ప్రభుత్వం 85 లక్షల కుటుంబాలకుపైబడి వైద్య సేవలు అందిస్తోందన్నారు. ఎవరో వచ్చి ఏదో విమర్శలు చేస్తుంటారనీ, వాటితో ఉపయోగం లేదన్నారు. రెచ్చగొట్టేవాళ్లెవ్వరూ సాయం చేయరన్నారు ఈటెల రాజేందర్.
ఆరోగ్య శ్రీ సేవలు రాష్ట్రంలో ఎందుకు ఆగిపోవాల్సి వచ్చిందీ, గత ప్రభుత్వాలు నుంచి కూడా ఇది అమల్లో ఉంది. అంటే, దీనికంటూ బడ్జెట్ కేటాయింపులు అనేవి సాధారణ పరిపాలనలో భాగంగా జరగాల్సినవి. కానీ, కేవలం బిల్లుల చెల్లింపుల ఆలస్యం కారణంగానే ప్రైవేటు ఆసుపత్రులు సేవల్ని ఆపేయాల్సి వచ్చిదంటే ఏంటి అర్థం..? దీన్ని సక్రమంగా అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, ఇప్పుడు వారి వైఫల్యం గురించి మాట్లాడకుండా… కేంద్ర పథకంతో ఉపయోగం లేదనీ, కేంద్రం కంటే గొప్పగా ఆరోగ్యశ్రీ అమలు చేస్తామనడం ఎందుకు..? మొత్తానికి, వారి వైఫల్యంపై చర్చ జరగనీయకుండా ఇక్కడ కూడా కేంద్రం ప్రస్థావన తీసుకొచ్చారు మంత్రి ఈటెల. ఇంకోటి, కేంద్ర పథకం కొద్దిమందికి మాత్రమే మేలు చేస్తోందని దాన్ని అమలు చేయకుండా ఆపాల్సిన అవసరం ఏముంది..? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా ఒకటే కదా… అంతిమంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి కదా!