ప్రభుత్వమూ.. అధికారులు వేర్వేరా..? అధికారులతో పని చేయించుకోలేకపోవడం ప్రభుత్వ చేతకాని తనం కాదా..?… ప్రభుత్వం ఎక్కడైనా… అధికారులు పని చేయలేదని… తమ తప్పు కాదని.. కోర్టులో వాదిస్తే.. ఎలా ఉంటుంది.. ?. ఈ అనుమానాలన్నింటికీ తెలంగాణ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం.. ఆర్డీవో, కొండపాక మండల తహసీల్దార్లు…విధుల్లో నిర్లక్ష్యం వహించారని నేరుగా కోర్టుకు… అఫిడవిట్ సమర్పించేసింది. దాంతో.. కోర్టు వారికి రెండు నెలల జైలు శిక్ష , రెండు వేల రూపాయల జరిమానా విధించింది. గజ్వేల్ అంటే.. కేసీఆర్ సొంత నియోజకవర్గం. అలాంటి చోట్ల ఆర్డీవో లాంటి అధికారి.. ఉండాలంటే.. విశ్వాసపాత్రుడే అయి ఉంటారు. అయినప్పటికీ.. ఆయన పని చేయలేదని కోర్టుకే చెప్పి శిక్ష వేయించింది తెలంగాణ సర్కార్.
గజ్వేల్ నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం భూ సేకరణ జరిపింది. ఆయా గ్రామాల నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించలేదు. బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత మే నెలలో బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి… ప్రతి ఒక్క భూనిర్వాసితుడికి పరిహారం చెల్లించేలా క్షేత్ర స్థాయి నుంచి చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ పరిహారం అందలేదు.
దీంతో హైకోర్టు… తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు జాప్యం జరుగుతోందో తెలపాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గజ్వేల్ ఆర్డీఓ విజేందర్ రెడ్డి, కొండపాక తహశీల్దార్ ప్రభు విధుల్లో చూపుతున్న నిర్లక్ష్యం వల్లే జాప్యం జరుగుతోందని ప్రభుత్వం కోర్టుకు నివేదిక ఇచ్చింది. అధికారులు తమ సొంత వాదన వినిపించుకునే అవకాశం లేదు. ప్రభుత్వ లాయరే.. వాదించాలి. ప్రభుత్వ లాయర్… అధికారులు నిర్లక్ష్యం చేశారని వాదించారు. దీంతో భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులకు శిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అధికారులిద్దరూ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.