పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన ఏపీ సర్కార్… అందుకు తగ్గ కారణాలను.. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా చెబుతోంది. కేంద్రానికి.. ఓ కారణం.. ప్రజల ముందు మరో కారణం.. కోర్టులకు మరో కారణం చెబుతోంది. పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లను మార్చి తీరాలని నిర్ణయించుకుని ఆ మేరకు.. దూకుడుగా దూసుకెళ్లిపోయిన ఏపీ సర్కార్ కు.. ఇప్పుడు.. పలు చోట్ల వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడటం వల్ల చిక్కులు ఎదుర్కొంటోంది. అందుకే… ఎవరికి చెప్పాల్సిన కారణాన్ని వారికి చెబుతోంది.
నవయుగ పనులేమీ చేయలేదని కోర్టులో వాదన..!
నవయుగ సంస్థ… తమ కాంట్రాక్ట్ ను రద్దు చేయడంపై కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణలో… ఏపీ ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ వినిపించిన వాదన.. నవయుగ సంస్థ పనులు చేయకపోవడం. ఇంజినీరింగ్ పనులు 30 శాతం మాత్రమే పూర్తయ్యాయని.. ఏజీ వాదించారు. రికార్డుల ప్రకారం… 70 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. అయితే.. ఈ విషయం కోర్టులో ప్రస్తావన వచ్చినప్పుడు… ఇబ్బంది రాకుండా ఉండాలనుకున్నారేమో కానీ.. ఏజీ… 30 శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయనే వాదనకు.. కొత్త కొలమానం వివరించారు. డ్రోన్ల సాయంతో తీసిన దృశ్యాల ఆధారంగా ప్రభుత్వం విశ్లేషించి.. 30 శాతానికే ఫిక్స్ ఇయిందని.. ఏజీ వాదించారు. అదే సమయంలో… హైడల్ విద్యుత్ ప్రాజెక్ట్ రద్దు విషయం జెన్కో తెలియదని.. ప్రభుత్వమే చొరవ తీసుకుని రద్దు చేసిందని వాదించారు. చివరికి అసలు కోర్టుకు వచ్చే హక్కు నవయుగకు లేదని ఆర్బిట్రేషన్‌కు వెళ్లాలని వాదించారు. పనుల్లో గిన్నిస్ రికార్డు సృష్టించిన నవయుగ కంపెనీ అసలు పనులేమీ చేయలేదని… హైకోర్టులో ప్రభుత్వం వాదించడం … అధికారవర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది.
అవినీతి జరిగిందని ప్రజలకు చెబుతున్న సర్కార్..!
పోలవరం కాంట్రాక్టులను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందంటే… ఏపీ సర్కార్.. ప్రజలకు చెప్పే కారణం మాత్రం అవినీతి. పోలవరంను ఏటీఎంగా మార్చుకున్నారని… కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకున్నారని.. అంచనాలు పెంచేశారని.. ఇలా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. కానీ… ఒక్కదానిపైనా.. అధికారికంగా విచారణ లేదు. జగన్ బంధువు రేమండ్ పీటర్ .. అవినీతి జరిగిందని చెప్పింది.. కానీ.. ఎక్కడ జరిగింది..? ఎలా జరిగింది..? ఎవరిపై చర్యలు తీసుకోవాలో చెప్పలేదు. దాంతో ఆ నివేదికను.. పీపీఏ సైతం కామెడీగా తీసుకుంది. కానీ రాజకీయంగా..పోలవరం.. టీడీపీ అనేప్రస్తాన వస్తే ముందుగా అవినీతి అనే వైసీపీ సర్కార్ చెబుతోంది.
కాంట్రాక్టర్లను మార్చుకునే అధికారం ఉందని కేంద్రం వద్ద వాదన..!
కాంట్రాక్టర్లను మారిస్తే.. నిర్మాణ వ్యయం పెరిగి.. ఆలస్యం అవుతుందని.. అదే పనిగా.. కేంద్రం వారిస్తున్నా… కాంట్రాక్టర్లను మార్చుకునే అధికారం తమకు ఉందని ఏపీ సర్కార్ వాదించి.. ముందుకెళ్లిపోతోంది. కాంట్రాక్టర్లను ఎందుకు మార్చాలన్నదానిపై.. కేంద్రానికీ… ఏపీ సర్కార్ సరైన సమాధానం చెప్పలేకపోతోంది. ఎందుకంటే.. అవినీతి, అవకతవకలంటే.. ముందుగా.. పీపీఏనే దోషి అవుతుంది. ఎందుకంటే.. ప్రాజెక్ట్ మొత్తం .. పీపీఏ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. అందుకే.. తమకు అధికారం ఉందనే వాదనను.. వినిపిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్ట్ టెండర్లపై గురి పెట్టి ఏపీ సర్కార్.. ఇలా … సందర్భానికో వాదన వినిపిస్తూ.. చేస్తున్న వింత వాదనతో.. ప్రజల్లోనూ అనుమానాలు బలపడుతున్నాయి. ప్రాజెక్టును ఆపి వేయడానికో.. లేక తమ అస్మదీయులకు కాంట్రాక్టులను కట్టబెట్టడానికో.. జగన్మోహన్ రెడ్డి తాపత్రయ పడుతున్నారని.. భావిస్తున్నారు. ఇది ఆయన వల్లె వేస్తున్న ఆదర్శాలకు .. పూర్తి విరుద్ధంగా ఉంది.