ఏపీలో తీసుకునే నిర్ణయాలన్నీ… ప్రధానికి, హోంమంత్రికి చెప్పే చేస్తున్నామని విజయసాయిరెడ్డి.. నేరుగా మీడియాకు చెప్పడంతో బీజేపీలో కలకలం రేగింది. ఏపీ సర్కార్ నిర్ణయాలన్నీ అత్యంత వివాదాస్పదంగా ఉండటం.. ప్రజల దృష్టిలో… కక్ష సాధింపు చర్యలు గా ముద్రపడిపోవడంతో.. బీజేపీ అలర్ట్ అయింది. తమ ప్రమేయం ఏమీ లేదని… చెప్పడానికి వెంటనే.. బీజేపీ తరపున సుజనా చౌదరిని రంగంలోకి దింపారు. సుజనా చౌదరి.. వైసీపీపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. విజయసాయిరెడ్డి ఏ ప్రాతిపదిన అలా ప్రకటన చేశారని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి తన స్టేట్మెంట్లతో తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఏ ప్రాతిపదికన ప్రధాని, హోంమంత్రితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నారని …ప్రశ్నించారు. నిజంగా అలానే చేస్తే.. పోలవరం కాంట్రాక్ట్ విషయంలో కేంద్రం సూచనను ఎందుకు పట్టించుకోలేదన్నారు. పీపీఏ రద్దు విషయంలో కేంద్రం సూచనను ఎందుకు పట్టించుకోలేదో చెప్పాలన్నారు. తాను జలశక్తి మంత్రితో ఇతర మంత్రులతో మాట్లాడానని…వారెవరూ తమకేమీ తెలియదంటున్నారని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని సుజనా స్పష్టం చేశారు.
ఏపీలో వైసీపీ సర్కార్ పై సుజనా చౌదరి ఓ రేంజ్ లో ఫైరయ్యారు. ముఖ్యంగా రాజధాని విషయంలో.. వైసీపీ నేతల ప్రకటనలపై మండిపడ్డారు. రాజధాని విషయంలో ప్రజలను ఇంత గందరగోళపర్చకూడదని… జనాన్ని గందరగోళపరిచే విషయాల్లోకి కేంద్రాన్ని లాగకూడదని హెచ్చరించారు. వైసీపీలో బొత్స, అవంతి, సాయిరెడ్డి తలో రకంగా మాట్లాడారని.. వరదలు వచ్చినంత మాత్రాన రాజధానిని మారుస్తారా అని సుజనాచౌదరి ప్రశ్నించారు. అమరావతిలో ప్రభుత్వ భవనాలు, క్వార్టర్స్ సిద్ధమయ్యాయి.. ఇప్పుడు రాజధాని మారుస్తారని తాను అనుకోవడం లేదన్నారు.
ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. ఇష్టానుసారం వ్యవహరిస్తే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతామని… ఏపీ ప్రయోజనాలు బీజేపీకి ముఖ్యమని ప్రకటించారు. వరదల విషయంలో కేంద్ర జల సంఘం ముందుగానే హెచ్చరించినా… వరదల్లో ముంచాలన్న కుట్ర, కుతంత్రాల వల్ల ప్రజలు నష్టపోయారన్నారు. రైతులకు అపారంగా పంటనష్టం జరిగింది.. దీనికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయింది..ఏమీ తెలియని గందరగోళం ఉందన్నారు. విజయసాయిరెడ్డి ప్రకటన.. వెంటనే… సుజనా చౌదరి ఖండన… బీజేపీ.. వైసీపీ మధ్య ఉన్న కనిపించని స్నేహానికి గండికొట్టే సూచనలు కనిపిస్తున్నాయి.