హైదరాబాద్: కిర్లంపూడిలో ముద్రగడ నిరాహార దీక్ష కొనసాగుతుంది. అయితే ఆయన దీక్ష విషయంలో కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. తక్షణమే కాపులను బీసీల్లో చేర్చాలని, సంవత్సరానికి వెయ్యికోట్ల చొప్పున నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చిన ముద్రగడ పద్మనాభం ఒక మెట్టు దిగారు. బీసీల్లో చేర్చే విషయమై ఏర్పాటు చేసిన కమిషన్ నివేదిక సమర్పించటానికి విధించిన గడువును మూడునెలలకు కుదించాలని అన్నారు. చర్చలకు తాను వ్యతిరేకం కాదని, ఆహ్వానిస్తే చర్చలకు వెళతానని, ఎవరు వచ్చినా మాట్లాడతానని చెప్పారు. తన ప్రాణం తన జాతికి అంకితమని అన్నారు. కిర్లంపూడికి ఎవరూ రావద్దని, తమతమ ప్రాంతాలలోనే నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ముద్రగడకు షుగర్ లెవల్స్, ముద్రగడ సతీమణి పద్మావతికి బీపీ లెవల్స్ పడిపోయినట్లు తెలిపారు. వారిద్దరికీ షుగర్, బీపీ తదితర అనారోగ సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు.
అటు తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల ముద్రగడ దీక్షకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మహిళలు ఖాళీ పళ్ళాలు, గరిటెలతో శబ్దాలు చేస్తూ నిరసన తెలిపారు. మరోవైపు కిర్లంపూడికి ముద్రగడ అభిమానులు తరలివస్తున్నారు. పోలీసులు వారిని నిలవరిస్తున్నారు. కిర్లంపూడి ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. వాహనాలన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో సర్క్యూట్ హౌస్లో కాపు మంత్రులు చినరాజప్ప, గంటాశ్రీనివాసరావు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ సీతారామానంజనేయులుతో అత్యవసరభేటీ నిర్వహించారు. కాపు రిజర్వేషన్, ముద్రగడ దీక్ష అంశాలపై ప్రస్తుతం మంతనాలు జరుపుతున్నారు.