వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై విభాగం.. నిన్నామొన్నటిదాకా కాస్త ఐక్యంగానే ఉంది. ఒక సామాజికవర్గమే ఎక్కువగా ఉన్నప్పటికీ.. జగన్పై అభిమానం ఉన్న ఇతరులు కూడా.. కన్వీనర్లుగా.. కష్టపడి పని చేశారు. వీలైనంతగా.. ఎన్నికలకు ధన సాయం చేశారు. ఇక సోషల్ మీడియా ప్రచారాల సంగతి చెప్పనవసరం లేదు. వైసీపీ భావజాలానికి తగ్గట్లుగా.. తమ స్థాయి కాకపోయినా… తగ్గించుకుని అయినా ప్రచారాలు చేశారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండు, మూడు నెలలలో వారంతా రియలైజ్ అయిపోయారు. బయట చెప్పుకుంటున్న రాష్ట్ర పాలన చూసి కాదు… పార్టీ పాలన చూసి. సీఎం హోదాలో పార్టీ అధ్యక్షుడు అమెరికా వచ్చి… అందర్నీ ఖుషీ చేస్తాడనుకుంటే.. మొత్తానికే సునామీ తెచ్చి పెట్టారు. ఇప్పుడు ఎన్నారై వైసీపీ మొత్తం ఒకరంటే.. ఒకరు పడని స్థితికి చేరుకున్నారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు.
వైసీపీ కన్వీనర్ల మధ్య ఉప్పు-నిప్పులా వ్యవహారం..!
ఎన్నారై వైసీపీలో అమెరికాలోని ప్రతి స్టేట్ నుంచి ఓ కన్వీనర్ ను నియమించారు. వీరిలో చాలా మంది వైసీపీ నేతలకు.. బంధువులు, పరిచయస్తులు. కొంత మంది.. వైసీపీ నేతలు ఎవరైనా అమెరికాకు వస్తే… ఖర్చులు పెట్టుకుని .. దగ్గరుండి అవసరాలు చూసుకునేవారు. జగన్ సభను డల్లాస్లో ప్లాన్ చేయాలనుకున్నప్పుడు.. అందరూ కలిసి.. తానా సభల కంటే గొప్పగా చేయాలని అనుకున్నారు. కానీ.. పేరు మాత్రం.. నాకే రావాలని… ఒకరికి తెలియకుండా ఒకరు అనుకున్నారు. ఫలితంగా సభ ఫ్లాప్ అయింది. అయితే.. ఈ క్రమంలో కన్వీనర్లను… కూడా… అవమానించిన వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. పలువురు కన్వీనర్లకు వీఐపీ ట్యాగ్లు కూడా ఇవ్వకుండా.. సాధారణ ట్యాగ్లు ఇచ్చి … వాటినే వీఐపీ ట్యాగ్లని చెప్పి అవమానించారు. సుదీర్ఘ కాలంగా.. వైఎస్ అభిమానిగా ఉన్న ఓ 70 ఏళ్ల డల్లాస్ పెద్ద మనిషికి.. స్టేజిపై కుర్చీ వేసి.. మళ్లీ తీసేసి.. ఆయనను ఓ వైపు కార్యక్రమం అయిపోయే వరకూ నిలబెట్టడం.. ” వైసీపీలో అంతే” అనుకునేలా చేసింది. ఈ వ్యవహారాలన్నీ.. కన్వీనర్ల మధ్య చిచ్చుకు కారణం అయ్యాయి. జగన్ అమెరికాలో ఉండగానే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ.. మెయిల్స్ ఫార్వార్డ్ చేసుకుంటున్నారు.
మంట రాజేసిపోయిన చెవిరెడ్డి..!
కన్వీనర్లు అందరూ… కలసి జగన్ సభను నిర్వహిస్తే.. అంతో ఇంతో సమన్వయం ఉండేది. కానీ మధ్యలోనే… పార్టీ తరపున వచ్చానంటూ… చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రంగంలోకి వచ్చారు. సభ ఏర్పాట్లను పర్యవేక్షించినట్లు షో చేసింది ఆయనే. మొత్తంగా.. మూడున్నర లక్షల డాలర్లు చందాలు వేసుకుని కన్వీనర్లు కష్టాలు పడితే.. చెవిరెడ్డి.. సీఎం జగన్ ముందు.. అంతా తానే చేశానన్న షో కోసం… హడావుడి చేశారు. ఈ క్రమంలో చాలా మంది కన్వీనర్లను కనీసం.. జగన్ దగ్గరకు కూడా పోనీయకుండా చేశారు. జగన్ కూడా అంతా చెవిరెడ్డే చేశారనుకున్నారు. అందుకే.. స్టేజిమీద కుర్చీల్లేకపోతే.. ఆయననే… నిలదీస్తూ కనిపించారు.
వైసీపీలో అంతేనా..?
సాధారణంగా వైసీపీ అంటే… ఒక సామాజికవర్గం పెత్తనం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ… బంధుత్వాలు.. ఇతర అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇతర వర్గాలు.. అభిమానులకు.. ఎక్కడా పెద్ద పీట వేయరు. కానీ.. ఎన్నారై విభాగం అనే సరికి.. అలాంటి వివక్షలేమీ ఉండవని.. అనుకున్నారు. కానీ.. అక్కడ జరిగింది వేరు. ఆంధ్రలో జరిగే… వైసీపీ రాజకీయ సభల్లో సీన్లు .. వేదికపై సీట్ల తోసుకోవడం… అందరూ అరుచుకోవడం.. ఎవరి మాటా.. ఎవరూ వినకపోవడం… లాంటివన్నీ.. అక్కడ కనిపించాయి. ప్రతీ గందరగోళం డల్లాస్ సభలో కనిపించింది.