పోలవరం ప్రాజెక్టుల రివర్స్ టెండరింగ్ విషయంలో ఎవరి మాటా వినని.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. పోలవరం రివర్స్ టెండర్లకు జారీ చేసిన నోటిఫికేషన్‌పై ఇక ఎలాంటి అడుగు ముందుకు వేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నవయుగ గతంలో దక్కించుకున్న హైడల్ విద్యుత్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ రద్దు నిర్ణయాన్ని హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రభుత్వం.. ఎటువంటి కారణం చూపించకుండా.. తమ కాంట్రాక్టులను టెర్మినేట్ చేసిందని.. ఆరోపిస్తూ.. నవయుగ సంస్థ కోర్టులో పిటిషన్లు వేసింది. అటు నవయుగ.. ఇటు ప్రభుత్వం తరపు వాదనలు విన్న హైకోర్టు.. ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపి వేసింది.
ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును రద్దు చేయడంపై.. కోర్టులో ప్రభుత్వం విచిత్రమైన వాదన వినిపించింది. నవయుగ సంస్థ పనులు చేయకపోవడం వల్లనే కాంట్రాక్ట్ టెర్మినేట్ చేశామని.. కోర్టులో వాదించారు. ఇంజినీరింగ్ పనులు 30 శాతం మాత్రమే పూర్తయ్యాయని..డ్రోన్ల సాయంతో తీసిన దృశ్యాల ఆధారంగా ప్రభుత్వం విశ్లేషించి.. ఈ మాట చెబుతున్నామని ఏజీ వాదించారు. కానీ పనులు చేయడంలో నవయుగకు గిన్నిస్ రికార్డు ఉంది. అదే సమయంలో.. హైడల్ విద్యుత్ ప్రాజెక్ట్ రద్దు విషయం జెన్‌కో తెలియదని.. ప్రభుత్వమే చొరవ తీసుకుని రద్దు చేసిందని వాదించారు. అసలు స్థలమే చూపించనప్పుడు.. హైడల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం ఎలా ప్రారంభిస్తామని నవయుగ వాదించింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ప్రభుత్వ నిర్ణయాలను సస్పెండ్ చేసింది.
ఏపీ సర్కార్ మొదటి నుంచి… కాంట్రాక్టర్లను తొలగించాలన్న ఏకైక లక్ష్యంతోనే.. ముందుకెళ్తోంది. జగన్మోహన్ రెడ్డి బంధువు అయిన రేమండ్ పీటర్ అనే ఉన్నతాధికారి నేతృత్వంలో కమిటీ వేసి.. మొదటి నుంచి తాము చెబుతున్న ఆరోపణలనే.. నివేదిక ద్వారా ఇప్పించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. వాటినే చూపి.. కాంట్రాక్టులను టెర్మినేట్ చేశారు. కానీ… ఆ కమిటీ ఎలాంటి సాక్ష్యాలు చూపించలేదని..పైగా దానికి చట్టబద్దత లేదని తేలిపోయింది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ కూడా రివర్స్ టెండర్లపై.. వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో… హైకోర్టు నిర్ణయం… ఏపీ సర్కార్‌కు చెంపపెట్టులా మారింది.