ఈగ లాంటి సినిమాలతో సుదీప్‌కి తెలుగులో క్రేజ్ ఏర్పడింది. ఈగ తరవాత ఎన్ని ఆఫర్లు వచ్చినా సుదీప్ చేయలేదు. ఎందుకంటే కన్నడలో తనో సూపర్ స్టార్. కాకపోతే.. సుదీప్ నటనకు మాత్రం అభిమానులు తగ్గలేదు. సుదీప్ నటించిన కొన్ని కన్నడ చిత్రాలు తెలుగులో వచ్చాయి. కానీ అవేం వర్కవుట్ కాలేదు. ఇప్పుడు పహిల్వాన్ వస్తోంది. స్పోర్ట్స్ నేపథ్యంలో నడిచే కథ ఇది. ఇలాంటి కథలకు ఇప్పుడు గిరాకీ బాగా ఏర్పడింది. ఈ కథలకు నేటివిటీ సమస్య కూడా ఉండదు. అందుకే – తెలుగులోనూ ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. వారాహి చలన చిత్రం తెలుగులో ఈ సినిమాని విడుదల చేయడం వల్ల.. పబ్లిసిటీ పరంగా ఎలాంటి ఢోకాఉండదు.
ట్రైలర్‌ని ఈ రోజు విడుదల చేశారు. ట్రైలర్లో డైలాగులు, విజువల్స్.. కట్టిపడేస్తున్నాయి. ఓ మల్లయోధుడి కథ ఇది. తన జీవితంలో ఎదుర్కున్న ఆటుపోట్లు, ఎత్తు పల్లాలు, జయాపజయాలు ఈ సినిమాలో చూపించబోతున్నారు. మల్లయోధుడిలా… తన పర్సనాలిటీ సరిపోకపోయినా – కండలతో, యాక్షన్ తో మైమరపించేశాడు సుదీప్.
బలం ఉందన్న అహంకారంతో కొట్టేవాడు రౌడీ
బలమైన కారణంతో కొట్టేవాడు యోధుడు
దేవుడు అందరికీ కలల్నిస్తాడు
కానీ ఆకలే కలల్ని తినేత్తది
నీకు నీకు కుస్తీ ఎలా చేయాలో నేర్పించాను
నువ్వు ఎందుకు చేయాలో నేర్చుకున్నావ్
– లాంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. విజువల్ పరంగా గ్రాండిటీ ఉంది. పేరున్న నటీనటులు కూడా
కనిపిస్తున్నారు. తెలుగులో మంచి ప్రచారం చేసుకున్నట్టయితే మంచి వసూళ్లు దక్కే అవకాశం ఉంది.